శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (17:51 IST)

మెల్‌బోర్న్‌లో మెరిసిన ధోనీ... అజేయ జట్టుకు చుక్కలు చూపిన కోహ్లీ సేన

క్రికెట్ చ‌రిత్ర‌లో ఆస్ట్రేలియాకు తిరుగులేని ఆధిప‌త్యం ఉంది. ఆ జ‌ట్టుకు అజేయ ఆస్ట్రేలియా అన్న గుర్తింపు కూడా ఉంది. ఆ గడ్డపై అడుగుపెట్టిన ఏ జట్టు అయినా కంగారులు చేతిలో ఓటమి పాలుకావాల్సిందే. ముఖ్యంగా, సిరీస్ గెలవడం అనేది అసాధ్యం. హేమాహేమీలు ఉన్న ఎన్నో జ‌ట్లు కూడా ఆ అరుదైన ఘ‌న‌త‌ను సాధించ‌లేక‌పోయాయి. 
 
కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అనిర్వ‌చ‌నీయ‌మైన చ‌రిత్ర సృష్టించింది. కంగారూల‌ను ఆ దేశ గ‌డ్డ‌పైనే కంగారుపెట్టించింది. కోహ్లీ, ధోనీ వంటి మేటి ఆట‌గాళ్లతో టీమిండియా పెను సంచ‌ల‌నం న‌మోదు చేసింది. బ్యాగీ గ్రీన్ ప్లేయ‌ర్ల‌కు మ‌నోళ్లు ధీటైన జ‌వాబు ఇచ్చారు. ప్ర‌తి దేశంలోనూ సిరీస్‌ను గెలుస్తూ ఇప్పుడు భార‌త్ కూడా అజేయ భార‌త్‌గా వెలిగింది. 
 
ట్వంటీ-20, టెస్టు, వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై గత యేడాది నవంబరు నెలలో అడుగుపెట్టింది. మూడు ట్వంటీ-20ల సిరీస్‌ను భారత జట్టు 1-1 తేడాతో సమం చేసింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. 
 
ఆ తర్వాత జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఆ సిరీస్‌లో పుజారా మూడు సెంచ‌రీలు చేయ‌డం విశేషం. సాధార‌ణంగా స్వంత గ‌డ్డ‌పై ఆధిప‌త్యం సాధించే ఆసీస్ బౌల‌ర్ల‌ను టెస్ట్ సిరీస్‌లో మ‌నోళ్లు చాక‌చ‌క్యంగా ఎదుర్కొన్నారు. కెప్టెన్ కోహ్లీ కూడా ఓ టెస్టు సెంచ‌రీతో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 
 
ఆసీస్ ఆట‌గాళ్ల‌కు స్లెడ్జింగ్ అంటే మ‌హాస‌ర‌ద‌. అయితే ఆ మాట‌ల‌యుద్ధానికి కూడా మ‌నోళ్లు క‌రెక్ట్ స‌మాధాన‌మే ఇచ్చారు. ఓ టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ పెయిన్‌.. కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. అప్పుడు ఇద్ద‌ర్నీ అంపైర్లు నివారించారు. ఆస్ట్రేలియా జిత్తుల‌కు భార‌త్ మాత్రం త‌లొగ్గ‌లేదు. భారత ఆటగాళ్లు ఎక్కడా సహనం కోల్పోదు. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 
 
ఇకపోతే, వ‌న్డేల్లో మిస్ట‌ర్ కూల్ త‌న మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శించాడు. మూడు వ‌న్డేల్లోనూ మూడు హాఫ్ సెంచ‌రీల‌తో త‌నలో స‌త్తా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. చివ‌రి రెండు వ‌న్డేల్లో చివ‌రి వ‌ర‌కు ఆడి ఆ మ్యాచ్‌ల‌{తొలి వన్డేలో 51, రెండో వన్డేలో 55 (నాటౌట్), మూడో వన్డేలో 87 (నాటౌట్)}ను గెలిపించాడు. మెల్‌బోర్న్ వికెట్ స్లోగా ఉన్న కార‌ణంగా.. ధోనీ త‌న అనుభ‌వాన్ని చూపించాడు. బ్యాటింగ్‌లో ఎంతో నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఆచితూచి ఆడుతూనే బౌండ‌రీలు సాధించాడు. మిస్ట‌ర్ కూల్ నిజంగా కూల్‌గా ఆడ‌టం వ‌ల్లే వ‌న్డే సిరీస్ 2-1 తేడాతో భార‌త్ వ‌శ‌మైంది. మొత్తంమీద ఆస్ట్రేలియా పర్యటనను భారత్ విజయవంతంగా ముగించింది. 
 
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత సేన... మరో నాలుగు బంతులు మిగిలివుండగానే, మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్లు రోహిత్ శర్మ  9, ధావన్ 23, కోహ్లీ 46, ధోనీ 87 (నాటౌట్), జాదవ్ 61 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ముఖ్యంగా, ధోనీ, జాదవ్‌లు ఆత్యద్భుతంగా ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించారు. 
 
అంతకుముందు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను భారత లెగ్ స్పిన్నర్ చాహెల్ పేకమేడలా కూల్చాడు. 10 ఓవర్లు బౌలింగ్ ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. చాహెల్ ధాటికి హ్యాండ్స్‌కోంబ్ (58) ఒక్కడే అర్థ సెంచరీ మార్క్‌ను సాధించాడు. మిగిలిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారీ స్కోరు చేయలేక పోయారు. ఫలితంగా 48.4 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 230 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ చాహెల్ మాయాజాలంముందు కంగారులు బెంబేలెత్తిపోయారు. దీంత భారత్ ముంగిట 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచినట్టయింది. 
 
వాస్తవానికి ఈ మ్యాచ్‌కు తొలుత వరుణదేవుడు ఆటంకం కలిగించాడు. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేక పోయారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో కారీ 5, ఫించ్ 14, ఖవాజా 34, మార్ష్ 39, కాంబ్ 58, స్టోయిన్స్ 10, మాక్స్‌వెల్ 26, రిచర్డ్‌సన్ 16, జంపా 8 చొప్పున పరుగులు చేశారు. స్టాన్ లేక్ డకౌట్ కాగా, సిడిల్ పది పరుగులు చేశారు. 
 
ముఖ్యంగా, భారత స్పిన్నర్ చాహెల్ విజృంభించి ఏకంగా 6 వికెట్లు తీశాడు. భువనేశ్వర్, షమీలు రెండేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా, వైఎస్ చాహెల్ పది ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు. 4.20 సగటుతో 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా చాహెల్ రికార్డు సృష్టించాడు. అలాగే, భారత జట్టు కూడా ఆసీస్ గడ్డపై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.