1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (18:09 IST)

హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ : ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి

england test team
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. పర్యాటక ఇంగ్లండ్ జట్టు తన స్పిన్ అస్త్రంతో భారత్‌ను కుప్పకూల్చింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా, ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ కొత్త స్పిన్నర్ టామ్ హార్ట్ లే ఏడు వికెట్లతో రాణించి భారత్ వెన్నువిరిచాడు. 
 
231 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయింది. కెరీర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లే 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆఖరులో బుమ్రా (6), సిరాజ్ (12) భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేసి భారత్‌ గెలుపుపై ఆశలు కలిగించినా హార్ట్ లే మళ్లీ బౌలింగ్‌కు దిగి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 
 
తొలి బంతికే సిరాజ్ స్టంపౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ ర్మ 39, రాహుల్ 22, భారత్ 28, అశ్విన్ 28 చొప్పున పరుగులు చేశారు. ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌‍లో ఇంగ్లండ్ జట్టు 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 2వ తేదీ నుంచి విశాఖపట్టణం వేదికగా జరుగనుంది. 
 
సంక్షిప్త స్కోరు వివరాలు... 
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 246 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 436 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 420 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 202 ఆలౌట్