నేను ఫిట్‌గా వున్నాను.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగలను.. షోయబ్ మాలిక్
పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై మండిపడ్డాడు. తనకు ఇంకా 39 ఏళ్లే అని.. ఇప్పట్లో తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని మాలిక్ స్పష్టం చేశాడు. షోయబ్ మాలిక్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ మధ్య పాకిస్తాన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో మాలిక్ తన రిటైర్మెంట్ వార్తలను కొట్టి పారేశాడు. తనకు రిటైర్మంట్ ప్రకటించే ఛాన్స్ లేదంటూ స్పష్టం చేశాడు. "నేను ఇంకా ఫిట్‌గా ఉన్నాను. నేను బ్యాటింగ్, బౌలింగ్ చేయగలను" అని మాలిక్ ట్వీట్ చేశాడు.
కాగా, ఇటీవల కాలంలో పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై మాలిక్ వరుస ట్వీట్లతో విరుచుకపడ్డాడు. కెప్టెన్ బాబర్ అజమ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదని పేర్కొన్నాడు.
ప్రధాన కోచ్ మనసుకు నచ్చిన వాళ్లను ఎంపిక చేస్తున్నారని.. సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ ఉన్న వారికి ఛాన్స్ ఇస్తున్నట్లు ఉన్నదని మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశాడు.
మరోవైపు తనకు జాతీయ జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోచ్‌గా ఉండమని పిలుపు వచ్చినా తాను వెళ్లలేదని మాలిక్ పేర్కొన్నాడు. తాను రాబోయే రెండేళ్ల కాలానికి పలు లీగ్స్‌తో కాంట్రాక్టులు కుదుర్చుకున్నానని.. ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత తాను రిటైర్ అవ్వాల్సిన అవసరం ఏమున్నదని మాలిక్ ప్రశ్నించాడు.
మాలిక్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి లీగ్స్‌లో ఆడుతున్నాడు. చాన్నాళ్లుగా పాకిస్తాన్ టీ20 జట్టులో తిరిగి స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు.