శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 1 జూన్ 2017 (03:11 IST)

కోచ్‌తో విభేదాలు కాదు.. కోహ్లీకి అసలైన పరీక్ష ఇదే.. నేడే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ పోరు ప్రారంభం

వన్డే క్రికెట్ భవితవ్యాన్ని తేల్చి పడేసే ఎనిమిదో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ పోరు నేడే లండన్‌లో ప్రారంభం కానుంది. ఎనిమిది దేశాల జట్టు పోటీపడుతున్న ఈ టోర్నీలో తమ సత్తా చాటేందుకు ప్రపంచ అగ్రశ్రేణి జట్లు సన్నద్దమయ్యాయి. గ్రూప్‌ ‘ఎ’లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా

వన్డే క్రికెట్ భవితవ్యాన్ని తేల్చి పడేసే ఎనిమిదో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ పోరు నేడే లండన్‌లో ప్రారంభం కానుంది. ఎనిమిది దేశాల జట్టు పోటీపడుతున్న ఈ టోర్నీలో తమ సత్తా చాటేందుకు ప్రపంచ అగ్రశ్రేణి జట్లు సన్నద్దమయ్యాయి.  గ్రూప్‌ ‘ఎ’లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌ ఉండగా... గ్రూప్‌ ‘బి’లో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

టోర్నీలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో ఆడుతుంది. పాయింట్ల ఆధారంగా ఒక్కో గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జూన్‌ 18న ఓవల్‌ స్టేడియంలోనే ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. కాగా గురువారం లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
 
చాంపియన్స్‌ ట్రోఫీ బరిలో నిలిచిన ఇతర జట్లతో పోలిస్తే విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత్‌కే మంచి విజయావకాశాలు ఉన్నాయి. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు పదునైన పేస్‌ బౌలింగ్‌తో మన జట్టు ఈ టోర్నీకి సిద్ధమైంది. 2013లో జట్టు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ మరోసారి తమ ధాటిని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. శిఖర్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లలో కూడా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కోహ్లి, యువరాజ్, రహానేలతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. 
 
ఐపీఎల్‌ వైఫల్యం తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని కోహ్లి వార్మప్‌లోనే నిరూపించాడు. యువరాజ్‌ ఫామ్, ఫిట్‌నెస్‌పై కాస్త ఆందోళన ఉన్నా... కీలక సమయంలో అతను కోలుకోగలడని జట్టు మేనేజ్‌మెంట్‌ విశ్వసిస్తోంది. గత టోర్నీలో జట్టును విజేతగా నిలిపిన ధోని ఈసారి కెప్టెన్సీ భారం లేకుండా బరిలోకి దిగుతున్నాడు. అతడు కూడా తన పాత శైలిలో చెలరేగితే భారత్‌కు ఎదురుండదు. ఈ టోర్నీ తర్వాత ధోని కెరీర్‌ కొనసాగించడంపై కూడా సందేహాలు ఉండటంతో అతని మెరుపులకు ఇదే ఆఖరి అవకాశం. 
 
బౌలింగ్‌లో భారత పేస్‌ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. షమీ, ఉమేశ్, భువనేశ్వర్, బుమ్రాలు ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో చెలరేగిపోయే అవకాశం ఉంది. రెండు వార్మప్‌ మ్యాచ్‌లు దానిని నిరూపించాయి కూడా. అగ్రశ్రేణి స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ నలుగురికి అండగా నిలుస్తాడు. కాబట్టి బౌలింగ్‌ బలగం కూడా జట్టును చాంపియన్‌గా నిలపడంతో కీలకం కానుంది.