1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (22:52 IST)

మ్యాక్స్‌వెల్ ఒంటరి పోరాటం : ఆస్ట్రేలియాను గెలిపించిన తీరు అత్యద్భుతం

maxwell
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో మంగళవారం మరో సంచలనం నమోదైంది. ముంబై వేదికగా జరిగిన ఆప్ఘానిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స‌వెల్ ఒంటరిపోరాటం చేసి జట్టును ఘోర పరాజయం నుంచి గట్టెక్కించాడు. 128 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. మొత్తం 128 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ పది సిక్స్‌లు 21 ఫోర్ల సాయంతో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలించాడు. ఒక దశలో 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాను మ్యాక్స్‌వెల్ ఆదుకున్నాడు. తద్వారా క్రికెట్ పసికూన ఆప్ఘాన్ జట్టు ఉంచిన 292 పరుగుల భారీ స్కోరును మరికొన్ని బంతులు మిగిలివుండగానే, ఏడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. 
 
అయితే, ఇక్కడ ఆస్ట్రేలియా జట్టు పోరాట పరిమను మాత్రం ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. 292 పరుగుల కొండంత లక్ష్యం.. 91 పరుగులకే 7 వికెట్లు ఔట్.. ఈ దశలో మ్యాచ్‌ను గెలవడం ఖచ్చితంగా అసాధ్యమే. కానీ, మ్యాక్స్‌వెల్ మాత్రం దానిని సుసాధ్యం చేశాడు. శాయశక్తులా పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 8 మ్యాచ్‌లో ఆరింట విజయం సాధించిన ఆసీస్ జట్టు సెమీస్ అవకాశాలను ఖరారు చేసుకుంది.
 
లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ జట్టు.. ఆప్ఘాన్ బౌలర్ల ధాటికి ప్రారంభంలో తేలిపోయింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడన్‌ను నవీన్ ఉల్ హక్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపగా, ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన మిచెల్ మార్ష్ (24)తో కలసి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (18) స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన మార్ష్ కూడా నవీన్ బౌలింగులోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వార్నర్‌ను ఒమర్జాయి చక్కటి బంతితో బౌల్డ్ చేశాడు.
afghanistan
 
ఆ మరుసటి బంతికే బంతికే జోష్ ఇంగ్లిస్ గోల్డెన్ డక్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన లబుషేన్ (14) దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. స్టోయినిస్ (6), మిచెల్ స్టార్క్ (3) కూడా విఫలం కావడంతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రికెట్ పసికూన ఆప్ఘాన్ జట్టు చేతిలో ఓటమి ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే నాలుగో డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ రూపాన్నే మార్చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటూ పరుగులు రాబట్టాడు. 
 
కెప్టెన్ కమిన్స్ (12*) అతడికి పూర్తి స్థాయిలో సహకరించాడు. ఓవైపు వికెట్ కాపాడుకుంటూ.. పరుగుల వరద పారించాడు. ఆఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడిని ఔట్ చేసేందుకు ఆప్ఘాన్ బౌలర్లు ఎంత ప్రయతిష్టించినా ఫలితం లేకపోయింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 46.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో వార్నర్ 18, హెడ్ 0, మార్ష్ 24, లబుషేన్ 14, ఇంగ్లిస్ 0, స్టోయినిస్ 6, స్టాక్ 3 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 15 రన్స్ వచ్చాయి. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘానిస్థాన్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో ఇబ్రహీం జర్డాన్ 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలించాడు. మిగిలిన ఆటగాళ్ళు కూడా రెండంకెల స్కోరు చేయడంతో ఆప్ఘాన్ జట్టు భారీ స్కోరు చేసింది.