గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (11:09 IST)

వెంటాడిన దురదృష్టం : ఇంగ్లండ్‌పై గెలుపు అయినా టోర్నీ నుంచి ఔట్!

అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్రధాన జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. ఈ జట్టుకు అదృష్టం కంటే దురదృష్టం బోలెడంత వుంది. అందుకే కీలక మ్యాచ్‌లలో కొన్నిసార్లు విజయం సాధించినప్పటికీ ప్రధాన పోటీకి అర్హత సాధించలేకపోతుంది. మరికొన్నిసార్లు ప్రధాన పోటీల్లో ప్రత్యర్థుల చేతిలో పరాజయంపాలవుతుంది. అదీకూడా గెలుపు ముంగిట బోల్తాపడుతుంది. తాజాగా ఇదే పరిస్థితి జరిగింది.
 
శనివారం రాత్రి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ దురదృష్టం వెంటాడంతో ఆ జట్టు ఏకంగా ఐసీసీ ట్వంటీ20 టోర్నీ నుంచే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఆ జట్టు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో నెగ్గినప్పటికీ పేలవమైన రన్‌రేట్ కారణంగా సెమీస్ బెర్త్‌ను చేజార్చుకుంది. డుసెన్ మెరుపు బ్యాటింగ్, రబడ హ్యాట్రిక్ కూడా జట్టును సెమీస్ చేర్చలేకపోయాయి. 
 
ఈ మ్యాచ్‌‍లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేశారు. వాన్ డెర్ డుసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో అజేయంగా 94 పరుగులు చేశాడు. 
 
మార్కరమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేయడంతో జట్టు స్కోరు పరుగులు పెట్టింది. ఓపెనర్లు హెండ్రిక్స్ 2, డికాక్ 34 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని సంధించింది.
 
ఆ తర్వాత 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సఫారీ బౌలర్ల దెబ్బకు 179 పరుగులు మాత్రమే చేసి పది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కోవడం ఇంగ్లీష్ ఆటగాళ్ళకు కష్టసాధ్యంగా మారింది. 
 
ఫలితంగా క్రమం తప్పకుండా ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. జాసన్ రాయ్ 20, జోస్ బట్లర్ 26, మొయీన్ అలీ 37, డేవిడ్ మలాన్ 33, లివింగ్‌స్టోన్ 28, కెప్టెన్ మోర్గాన్ 17 పరుగులు చేశారు. మ్యాచ్ ఆఖరులో కగిసో రబడ ఇంగ్లండ్‌ను దారుణంగా దెబ్బతీశాడు. 20వ ఓవర్ తొలి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పరాజయాన్ని శాసించాడు.
 
మొత్తం 20 ఓవర్లూ ఆడిన ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలింది. ఫలితంగా 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్‌రౌండర్ ప్రతిభతో సౌతాఫ్రికా విజయం సాధించినప్పటికీ సెమీస్ అవకాశాలను కోల్పోయి టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. అద్భుతమైన బ్యాటింగుతో జట్టుకు విజయాన్ని అందించిన డుసెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
 
దక్షిణాఫ్రికాపై ఓడినప్పటికీ నెట్‌రన్‌రేట్ అద్భుతంగా ఉండడంతో ఇంగ్లండ్ స్థానానికి ఎలాంటి ప్రమాదమూ వాటిల్లలేదు. గ్రూప్1లో అగ్రస్థానంలో కొనసాగుతూ సెమీస్‌కు దూసుకెళ్లగా, శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో విండీస్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి మరో బెర్త్‌ను సొంతం చేసుకుంది.