ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

మరోమారు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మరోమారు సత్తా చాటింది. తాము కూడా ఆస్ట్రేలియా పురుషుల జట్టుతో ఏమాత్రం తీసిపోమని నిరూపించింది. న్యూజిలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ తుదిపోరులో ఆస్ట్రేలియా మహిళా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను 71 పరుగుల తేడాతో చిత్తు చేసి విజేతగా నిలిచింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 355 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ జట్టు వికెట్ కీపర్ అలిస్సా హేలీ ఏకంగా 138 బంతుల్లో 170 పరుగులు చేశారు. ఈమె బ్యాట్‌తో వీరవిహారం చేయడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది.
 
ఆ తర్వాత కొండంత విజయలక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 43.4 ఓవర్లలో 285 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో స్కివర్ 148 పరుగులతో ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఫలితంగా 71 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
మరోవైపు, ఆసీస్ మహిళా జట్టు ఇప్పటివరకు 19 ప్రపంచ కప్‌ పోటీల్లో 12 సార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఇందులో ఏడు ప్రపంచ కప్‌లు, ఐదు టీ20 కప్‌లు ఉన్నాయి. అటు ఆస్ట్రేలియా పురుషుల జట్టు కూడా ఐదు సార్లు వన్డే ప్రపంచ కప్‌లు, ఒకసారి టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. మొత్తందా ఆస్ట్రేలియా 18 సార్లు విశ్వవిజేతగా నిలిచింది.