శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (10:57 IST)

భారత్‌తో అంతిమ పోరు కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాం : పాట్ కమ్మిన్స్

pat cummins
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోన నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబరు 19వ తేదీ ఆదివారం డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరుగనుంది. గురువారం కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా జట్ల మధ్య అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సఫారీలను కంగారులు ఓడించారు. దీంతో ఫైనల్‌లో భారత్‌తో అమీతుమీకి ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ ఫైనల్ పోరుపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్లో భారత్‌తో తలపడేందుకు వేచి ఉండలేకపోతున్నామన్నాడు. 
 
ఆతిథ్య టీమిండియాకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో అహ్మదాబాద్ స్టేడియం నిండిపోతుందని, భారత్‌కు ఏకపక్ష మద్దతు ఉంటుందని తెలుసని, ఈ పరిస్థితిని స్వీకరించి మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు. తమ జట్టు ఆటగాళ్లలోని పలువురికి ఇప్పటికే ఫైనల్స్ ఆడిన అనుభవం ఉండడం తమకు కలిసివచ్చే అవకాశమన్నారు. 2015 వరల్డ్ కప్ తన కెరీర్ బెస్ట్ అని, ఈ కారణంగానే భారత్‌తో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం తాను వేచివుండలేనని కమ్మిన్స్ పేర్కొన్నాడు. 
 
ఇదిలావుండగా అహ్మదాబాద్ స్టేడియం 1.3 లక్షల మంది సామర్థ్యాన్ని కలిగివున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై గెలుపుపై స్పందిస్తూ.. సునాయాసంగా గెలుస్తామని భావించామని, కానీ కాస్త ఇబ్బంది పడి గెలవాల్సి వచ్చిందని పాట్ కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు. రెండు గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠను అనుభవించాల్సి వచ్చిందని తెలిపాడు. ఆసీస్ ఆటగాళ్లతోపాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా చాలాబాగా ఆడారని అన్నాడు.