బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (15:43 IST)

ప్రపంచ కప్‌లో భారత్ వరుస విజయాలకు కారణం అదే : రాహుల్ ద్రావిడ్

dravid - rohith
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించి, బుధవారం సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వరుస విజయాలు సాధించడానికి గల కారణాన్ని ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందన్నాడు. విజయాల వైపు జట్టును నడిపించేందుకు ప్రత్యేకంగా జట్టుకు ఓ మిషన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు.
 
'ప్రపంచకప్ కోసం మేం కొన్ని సవాళ్లు సిద్ధం చేసుకున్నాం. తొమ్మిది వేర్వేరు నగరాల్లో జరిగిన మ్యాచ్‌లలో అభిమానుల నుంచి విశేషమైన మద్దతు లభించింది. వీలైనంత బాగా ఆడాలని, మంచి ప్రదర్శన కనబర్చాలని అనుకున్నాం. కుర్రాళ్లు కూడా చక్కగా ఆడారు' అని 'స్టార్ స్పోర్ట్స్'తో చెప్పుకొచ్చాడు.
 
సెమీస్‌కు ముందు ఆరు రోజుల విశ్రాంతి లభించిందని, ఇది తమకు బాగా కలిసి వచ్చిందన్నాడు. జట్టులోని ఐదుగురు బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, ఇద్దరు ముగ్గురు సెంచరీలతో అదరగొడుతున్నారని కితాబిచ్చాడు. బంతితో ప్రయోగాలు కూడా లాభించాయని వివరించాడు. 
 
జట్టులోని మిడిలార్డర్ అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించాడు. టాపార్డర్ కూడా పరుగుల వర్షం కురిపిస్తోందన్నాడు. లీడర్ బోర్డు వంక చూస్తే రోహిత్, కోహ్లీ పరుగుల వాన కనిపిస్తుందని, వారు అద్భుతంగా ఆడుతున్నారని ద్రవిడ్ ప్రశంసించాడు. మిడిలార్డర్‌పై సహజంగానే ఎప్పుడూ కొంత ఒత్తిడి ఉంటుందని వివరించాడు.