శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (08:26 IST)

చతికిలపడిన భారత్ - లంకకు ఊరటగలిచించే విజయం

కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ చతికిలపడింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో లంక విజయం సాధించింది. అయితే, సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 
 
శుక్రవారం జరిగిన  జరిగిన నామమాత్రపు చివరి వన్డేలో పర్యాటక జట్టు నిర్ధేశించిన 226 పరుగుల విజయ లక్ష్యాన్ని 39 ఓవర్లలో ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో ఒకటి నెగ్గి వైట్ వాష్ కాకుండా తప్పించుకుంది. తొలి రెండు వన్డేలను గెలిచిన భారత జట్టు ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టును శ్రీలంక బౌలర్లు దెబ్బకొట్టారు. ముఖ్యంగా దనంజయ, జయవిక్రమ పోటీలు పడి వికెట్లు తీశారు. ఇద్దరూ చెరో మూడు వికెట్లు తీసి టాపార్డర్‌ను దెబ్బ కొట్టారు. 
 
వీరికి చమీర సహకరించాడు. అతడో రెండు వికెట్లు తీసుకున్నాడు. కరుణరత్నె, శనక చెరో వికెట్ తీసుకోవడంతో భారత ఇన్నింగ్స్ 225 పరుగుల వద్ద ముగిసింది.
 
ఓపెనర్ పృథ్వీషా (49) మరోమారు ఆకట్టుకోగా, సంజు శాంసన్ (46), సూర్యకుమార్ యాదవ్ (40) క్రీజులో ఉన్నంత సేపు పరుగుల ప్రవాహం కొనసాగింది. కెప్టెన్ ధవన్ (13), మనీశ్ పాండే (11), హార్దిక్ పాండ్యా (19) మరోమారు విఫలమయ్యారు.
 
భారత ఇన్నింగ్స్ 23వ ఓవర్ వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు 45 నిమిషాలపాటు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 47 ఓవర్లకు కుదించారు. 
 
ఆ తర్వాత 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో ఓపెనర్ అవిషక ఫెర్నాండో మరోమారు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 98 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 76 పరుగులు చేయగా, భనుక రాజపక్స 56 బంతుల్లో 12 ఫోర్లతో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 
 
చరిత్ అసలంక 24, రమేశ్ మెండిస్ 15 పరుగులు చేయడంతో మరో 8 ఓవర్లు మిగిలి ఉండగానే శ్రీలంక విజయం సాధించింది. భారత బౌలర్లలో కొత్త కుర్రాళ్లు రాహుల్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టగా, చేతన్ సకారియా రెండు వికెట్లు తీసుకున్నాడు. కృష్ణప్ప గౌతమ్‌, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.
 
శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన అవిష్క ఫెర్నాండోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.