శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (10:06 IST)

ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లకు కొత్తగా ప్రయోగాలు చేయొద్దు : రవిశాస్త్రి

ravishastri
ఈ నెల 19వ తేదీ ఆదివారం ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్‌ కొత్త ప్రణాళికలు లేదా ప్రయోగాలతో బరిలోకి దిగొద్దని సీనియర్ మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ రవిశాస్త్రి సలహా ఇచ్చాడు. లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్ వరకు అనుసరిస్తున్న వ్యూహాలనే అమలు చేయాలని, అందుకు భిన్నంగా చేయాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశాడు. 
 
'భారత జట్టు ప్రశాంతంగా ఉంది. జట్టు సొంతగడ్డపై ఆడుతోంది. బాగా అనుభమున్న జట్టిది. ఏదీ భిన్నంగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆడుతున్నట్లే.. గత మ్యాచ్‌ను ముగించిన మాదిరే ఆడితే సరిపోతుంది. త్వరలో భారత జట్టు కప్‌ను అందుకుంటుంది. ఆటగాళ్లు ఒత్తిడిని దరిచేరనీయొద్దు. ఫైనల్‌ కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. జట్టులో ప్రతి ఒక్కరికి తమ బాధ్యతేంటో తెలుసు. ఒకరో ఇద్దరిపైనో జట్టు ఆధారపడకపోవడం అతిపెద్ద సానుకూలాంశం. 8, 9 మంది ఆటగాళ్లు నిలకడగా రాణిస్తుండటం గొప్ప సంకేతం' అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. 
 
నీకు దండం పెడతాం... ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండంటి... బిగ్ బికి ఫ్యాన్స్ వినతి  
 
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానులు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీన ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోటీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంకు రావొద్దంటూ కోరుకుంటున్నారు. బాబ్బాబూ.. మీకు దండం పెడతాం.. ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండండి అంటూ వారు ప్రాధేయపడుతున్నారు. దీంతో ఇపుడు ఏం చేయాలన్న డైలామాలో బిగ్ బి పడిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఈ నెల 15వ తేదీన ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడగా, భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, తాను మ్యాచ్ చూడకపోతే మనం గెలుస్తామని చెప్పారు. ఇది కాస్త వైరల్ అయింది. దీంతో అభిమానులు పై విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ ఒక్కసారి జట్టు కోసం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యర్థనలపై అమితాబ్ స్పందించారు. ఈ మ్యాచ్‌కు వెళ్ళాలా? వద్దా? అని ఆలోచనలో పడిపోయినట్టు చెప్పారు. ఇదిలావుంటే, భారత క్రికెట్ జట్టు ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచ విజేతగా నిలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అందుకే ఈ మ్యాచ్‌కు అమితాబ్ దూరంగా ఉండాలన్నది వారి ప్రధానకోరికగా ఉంది.