మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (13:17 IST)

విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడే కాదు.. జెంటిల్‌మెన్ కూడా: పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు

ఛాంపియన్స్ ట్రోఫీలో‌ భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో పాకిస్థాన్ విజయఢంకా ఎగురవేసింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్..

ఛాంపియన్స్ ట్రోఫీలో‌ భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో పాకిస్థాన్ విజయఢంకా ఎగురవేసింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్.. హుందాగా వున్నాయి. ఈ వ్యాఖ్యలపై దేశంలోని క్రికెట్ ఫ్యాన్స్‌కే కాకుండా పాకిస్థాన్ ఫ్యాన్స్‌‌కు కూడా తెగనచ్చేశాయి. 
 
మ్యాచ్ ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. గెలిచిన పాకిస్థాన్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఆటగాళ్ల ఆటతీరు అద్భుతంగా ఉందన్నాడు. పాకిస్థాన్‌ జట్టులో ఎంత టాలెంట్‌ ఉందో ఈ విజయం ద్వారా తెలుసుకోవచ్చునని కోహ్లీ వ్యాఖ్యానించాడు. వాళ్లదైన రోజున పాకిస్థాన్ ఆటగాళ్లు ఎలాంటి ప్రత్యర్థి జట్టునైనా చిత్తుగా ఓడిస్తారని.. ఈ మ్యాచ్ ద్వారా నిరూపితమైందని కోహ్లీ తెలిపాడు.  
 
ఈ నేపథ్యంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు గుప్పిస్తున్నారు. కోహ్లీ గొప్పదనాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. కోహ్లీ తన వ్యాఖ్యల ద్వారా ఎంతో మంది పాక్ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నాడని.. కోహ్లీ గొప్ప ఆటగాడే కాదు. జెంటిల్మెన్ అని ముబాషర్ అనే అభిమాని ట్విట్టర్ ద్వారా కొనియాడాడు.

విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బలాన్ని ప్రశంసించడం, హుందాగా మాట్లాడటం ద్వారా మ్యాచ్‌లో ఓడిపోయినా.. పాక్ ఫ్యాన్స్ మనస్సును కూడా కొల్లగొట్టాడని.. క్రీడలకు అత్యుత్తమ అంబాసిడర్‌గా కోహ్లీ వ్యవహరించాడని కొనియాడారు.