రెండో ట్వంటీ20 : ఆస్ట్రేలియా స్కోరు 194 - శిఖర్ అర్థ సెంచరీ
సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 195 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ దూకుడుగా ఆడుతోంది. భారత ఓపెనర్లు ధావన్, రాహుల్‌లు మంచి పునాది వేశారు. అయితే, కేఎల్ రాహుల్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. కానీ మరో ఓపెర్ ధావన్ మాత్రం అర్థ శతకం బాదిన తర్వాత మరో రెండు పరుగులు జోడించి 52 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇది ధావన్‌కు 11వ అర్థ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (19), శాంసన్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు, సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ (58), స్టీవ్ స్మిత్ (46), హెన్రిక్స్ (26), మ్యాక్స్ వెల్ (22) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 రన్స్ చేసింది.
రెగ్యులర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వేడ్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వేడ్ 32 బంతులాడి 10 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ అందరూ దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యమివ్వడంతో ఏ దశలోనూ స్కోరుబోర్డు విశ్రమించలేదు.
ఇకపోతే, భారత బౌలర్లలో నటరాజన్ మరోసారి రాణించాడు. ఈ తమిళనాడు యార్కర్ స్పెషలిస్ట్ 2 వికెట్లు తీసి తన ఎంపికకు న్యాయం చేశాడు. షమీ, బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్ల గైర్హాజరీలో దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ తేలిపోయారు. తొలి టీ20 విజయంలో కీలకపాత్ర పోషించిన చహల్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు విసిరి 51 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు.