ఆరంభం అదిరింది.. డబుల్ సెంచరీతో మయాంక్ అగర్వాల్ అదుర్స్ (video)

సెల్వి| Last Updated: శుక్రవారం, 15 నవంబరు 2019 (19:14 IST)
బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరంభమే అదరగొట్టాడు. ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు గురువారం ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి తడబాటుకు గురైంది. భారత ఫాస్ట్ బౌలింగ్‌కు స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది.

బంగ్లా కెప్టెన్ హక్ 37 పరుగులు, రహీమ్ 43 పరుగులతో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇస్లామ్, ఇమ్రూల్ ఆరు పరుగులకే వికెట్‌తో వెనుదిరిగారు. ఫలితంగా 58.3 ఓవర్లలో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటైంది. ఆపై బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు మయాంక్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ ఆరు పరుగులకే అవుట్ కావడం, విరాట్ కోహ్లీ ఒక్క రన్ కూడా చేయకుండానే వెనుదిరిగాడు. పుజారా 54 పరుగులు, రహానే 86 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. కానీ ఆరంభం నుంచి క్రీజులో నిలదొక్కుకుని అదరగొట్టిన యంగ్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చితక్కొట్టాడు. ఇది అతని కెరీర్‌లో
రెండో డబుల్ సెంచరీ కావడం గమనార్హం.

ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మయాంక్ డబుల్ సెంచరీతో అదుర్స్ అనిపించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీని సాధించాడు. ప్రస్తుతం 103 ఓవర్లు ముగిసిన తరుణంలో నాలుగు వికెట్ల పతనానికి భారత్ 384 పరుగులు సాధించింది. క్రీజులో మయాంక్ అగర్వాల్, జడేజాలున్న తరుణంలో భారత జట్టు బంగ్లాదేశ్ కంటే 234 పరుగుల ఆధిక్యంలో వుంది.దీనిపై మరింత చదవండి :