భారత బౌలర్లను చితక్కొట్టిన కివీస్ ఆటగాళ్లు...
కివీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి ట్వంటీ20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు బ్యాట్‌తో రెచ్చిపోయారు. ఫలితంగా భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో న్యూజిలాండ్ ఏకంగా 219 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత భారత జట్టు కేవలం 139 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ జట్టు 1-0 ఆధిక్యాన్ని సంపాదించుకుంది.
కాగా, వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌ప్యాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. సౌథీ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ(1) లాకీ పెర్గ్యూసన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన శిఖర్ ధావన్, విజయ్ శంకర్‌లు జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఈ జోడీకి పెర్గ్యూసన్ బ్రేక్ వేశాడు. పెర్గ్యూసన్ వేసిన 6వ ఓవర్ మూడో బంతికి శిఖర్ ధవన్(29) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ పిమ్మట శాంట్‌నర్ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి శంకర్(27) గ్రాండ్‌హోంకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొంత సమయానికే రిషబ్ పంత్(4) శాంటనర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఇష్ సోదీ బౌలింగ్‌లో దీనేశ్ కార్తీక్(5) సౌతీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో హార్థిక్ పాండ్యా(4) మిషెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ దశలో ధోనీ, కృనాల్ పాండ్యాతో కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కి 52 పరుగులు జోడించారు. అయితే 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కృనాల్ సౌతీ బౌలింగ్‌లో కీపర్ షైఫెర్ట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఆటగాళ్లు రాణించలేకపోయారు. ధోనీ(39) ఒక్కడే ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 19.2 ఓవరల్లో భారత్ 139 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ, కుమార్, చాహల్, అహ్మద్‌లు కేవలం ఒక్కో పరుగు మాత్రమే చేశారు.
అంతకుముందు, న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. సైఫర్ట్ అత్యధికంగా 84 పరుగులు చేయగా, మున్రో 34, టేలర్ 24, కుగ్లిల్జన్ 20 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లు బంతితో రాణించలేక పోయారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కుగ్లిల్జన్ అందుకున్నాడు.