శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (16:05 IST)

ప్రతీకారం తీర్చుకున్న కివీస్.. వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా

టీ-20 సిరీస్ కైవసం చేసుకుని.. కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించిన టీమిండియా పరాజయం పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది.

న్యూజిలాండ్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 22 పరుగుల తేడాతో ఓడింది. దీంతో టీ-20 సిరీస్ నెగ్గిన టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంది.

రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ ఇన్నింగ్స్ చివరకు పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0తో మరో మ్యాచ్ మిగులుండగానే సొంతం చేసుకుంది. 
 
లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా 19 బంతుల్లో 6 ఫోర్లతో 24 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (3) తీవ్రంగా నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీ (15), రాహుల్ (4), కేదార్ జాదవ్ (9) సైతం స్వల్పస్కోరుకే అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది.

ఆపై శ్రేయాస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడాడు. 52 పరుగులతో రాణించినా కీలక సమయంలో అవుట్ కావడంతో టీమిండియా పరాజయం వెంట నడిచింది. ఈ దశలో జడేజా లోయరార్డర్ బ్యాట్స్ మెన్ సాయంతో పోరాటం సాగించాడు. శార్దూల్ ఠాకూర్ 18 పరుగులు చేయగా, నవదీప్ సైనీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు.
 
అయితే కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో కివీస్ బౌలర్లు సఫలం అయ్యారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్, సౌథీ, జేమీసన్, గ్రాండ్ హోమ్ తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే ఫిబ్రవరి 11న మౌంట్ మాంగనుయ్‌‍లో జరగనుంది.