శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (10:37 IST)

శ్రీలంకను చితక్కొట్టేశారు : ట్వంటీ20 సిరీస్ భారత్ వశం

భారత బ్యాట్స్‌మెన్లు శ్రీలంక బౌలర్లను చితక్కొట్టారు. ఫలితంగా స్వదేశంలో జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను భారత్ తన వశం చేసుకుంది. పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్లు లోకేశ్‌ రాహుల్‌ 36 బంతుల్లో 54 (5 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ధవన్‌ 36 బంతుల్లో 52 (7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ శతకాలతో రాణిస్తే, మనీశ్‌ పాండే 18 బంతుల్లో 31 నాటౌట్ (4 ఫోర్లు), విరాట్‌ కోహ్లీ 17 బంతుల్లో 26 (2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. మ్యాచ్ చివర్లో శార్దూల్‌ ఠాకూర్‌ (8 బంతుల్లో 22 నాటౌట్ (1 ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 201 పరుగులు చేసింది. 
 
అనంతరం 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 15.5 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ (57; 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. భారత బౌలర్లలో నవ్‌దీప్‌ సైనీ 3, శార్దుల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శార్దూల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', సైనీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి. 
 
ఈ విజయంతో భారత్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక భారత్ తన తదుపరి సిరీస్‌ను కూడా సొంతగడ్డపైనే జనవరి 14 నుంచి ఆడనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి.