సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 9 జనవరి 2020 (21:41 IST)

శుక్రవారం చంద్రగ్రహణం, ఈ శ్లోకం, ఈ నియమాలు పాటిస్తే చాలు

శుక్రవారం జనవరి 10న చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం రాత్రి 10 గంటల 37 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గ్రహణ సమయంలో ''ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్'' అనే చంద్ర గాయత్రి మంత్రంతో జపము చేసుకోవచ్చు. గ్రహణం అనంతరం నదీ స్నానం చేసి.. నదీ తీరంలో అనుష్టానం చేసుకోవడం పుణ్యప్రదమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పాటించవలసిన నియమాలు 
గ్రహణ కాలానికి 9 గంటల ముందే భుజించాలనేది నియమం. అలాగే ఆ తర్వాత ఎలాంటి భోజన పదార్థాలను భుజింపరాదు. శుభ ఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనేందుకు సరైన సమయమేమిటో పండితులను అడిగి తెలుసుకోవాలి. మధ్యమ ఫలము ఉన్నవారితోపాటు అధమ ఫలము ఉన్నవారు కూడా వస్త్ర, ధాన్య, శాకాది, దానాలను శక్తికొద్దీ చేసుకోవాల్సి ఉంటుంది.
 
గ్రహణ కాలం వరకూ దేవతామూర్తుల పైన, అలాగే నిల్వ ఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి గ్రహణ అనంతరం తీసి వేయాలని పండితులు చెపుతున్నారు. గ్రహణం ముగిసిన మరుసటి రోజు దేవతా మందిరాన్ని, దేవతామూర్తులను శుద్ధి పరచుకోవాలని పండితులు వెల్లడిస్తున్నారు. గ్రహణ సమయంలో దేవతా పూజలు అభిషేకాలు చేయరాదు. ఉపదేశిత మంత్రము లేదా ఏదైనా దేవతా నామాన్ని జపిస్తే గణనీయ ఫలము సిద్ధిస్తుందని చెపుతున్నారు.
 
ఇకపోతే 2019 ఏడాది చివరిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. కొత్త సంవత్సరం 2020లో అడుగు పెట్టగానే మరో గ్రహణం అడుగు పెట్టబోతోంది. జనవరి 10వ తేదీ శుక్రవారం నాడు రాత్రి 10.37 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్థరాత్రి 2 గంటల 42 నిమిషాల వరకూ సాగుతుంది.

ఈ గ్రహణం మిధున రాశిలో ఏర్పడుతుంది కనుక ఆ రాశి వారు గ్రహణాన్ని చూడకుండా వుంటే మంచిది. పైగా ఈ రాశి వారిపైన గ్రహణం ప్రభావం తీవ్రంగా వుంటుంది జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. మొత్తం 4 గంటల పాటు సాగే ఈ చంద్రగ్రహణం మన దేశంతో పాటు ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల‌లో దర్శనమివ్వనుంది. 
 
ఇకపోతే ఈ గ్రహణం యొక్క ప్రభావం మిధున రాశిపైన తీవ్రంగా వుంటుందని పైన చెప్పడం జరిగింది. మిగిలిన 11 రాశుల వారి విషయంలో ఎలా వుంటుందో చూద్దాం. కర్కాటకం, సింహ, తుల, మకర రాశులపైన కూడా ప్రభావం వుంటుంది. మేషం, కన్య, వృశ్చిక, మీన రాశుల వారికి శుభం. తుల, వృషభ, ధనుస్సు, కుంభ రాశులవారికి మధ్యమ ఫలితం వుంటుంది.