ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? సుప్రీంకోర్టు ప్రశ్న
దేశంలోకి అక్రమంగా ప్రశ్నించిన వారికి ఆధార్ కార్డులు జారీ చేస్తున్నారని, అలాంటపుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించిది. ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరవేయడానికి మాత్రమేనని, దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కును రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది.
పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యంకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. పొరుగు దేశం నుంచి వచ్చిన ఓ కూలీ రేషన్ కార్డు కోసం ఆధార్ ఇస్తే, అతడిని ఓటరుగా కూడా చేయాలా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీసు కాదని, ఓటరు దరఖాస్తుతో పాటు సమర్పించిన పత్రాల వాస్తవికతను పరిశీలించే అధికారం దానికి ఉందని స్పష్టం చేసింది.
పిటిషనర్లు తరపున సీనియర్ న్యాయవాది కపిలి సిబల్ వాదనలు వినిపిస్తూ ఈసీ చేపట్టిన ప్రక్రియ నిరక్షరాస్యులైన సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్దమైన భారం మోపుతుందన్నారు. ఫారాలు నింపడం తెలియని వారిని జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాకపోయినా నివాసానికి సంబంధించి ప్రాథమిక ఆధారంగా పరిగణించాలని వాదించారు. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన పిటిషన్లపై డిసెంబరు ఒకటో తేదీ లోగా కౌంటరు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.