మంగళవారం, 25 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (10:01 IST)

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

Love
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ న్యాయవాదిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.  ఇద్దరి మధ్య ఉన్నది సమ్మతంతో కూడిన సంబంధమేనని, అది బెడిసికొట్టినంత మాత్రాన అత్యాచారం కేసు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది.
 
కేవలం శారీరక సంబంధం కోసమే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసపూరితంగా హామీ ఇస్తేనే అది రేప్ కిందకు వస్తుందని కోర్టు వివరించింది. అయితే, బలమైన ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణల ఆధారంగా దీనిని నిర్ధారించలేమని తెలిపింది. 
 
ఈ కేసులో, బాధితురాలు, నిందితుడైన న్యాయవాది 2022 నుంచి 2024 వరకు సంబంధంలో ఉన్నారు. వారి మధ్య పలుమార్లు శారీరక సంబంధం జరిగింది. గతంలో జరిగిన వివాహ వివాదం కారణంగా, నిందితుడు పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు మహిళే వ్యతిరేకించినట్లు కోర్టు గుర్తించింది. 
 
అలాంటిది, సంబంధం చెడిపోయాక పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించడం నిలబడదని పేర్కొంది. ఈ కేసును కొట్టివేయడానికి నిరాకరించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది.