టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు - పది పరుగులకే ఓ జట్టు ఆలౌట్
పరుగుల వరద పారే టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయింది. 8.7 ఓవర్లలో ఈ పరుగులు చేసింది. జట్టులోని 11 మంది ఆటగాళ్లలో ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారంటే వారి ఆటతీరు ఏ విధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. ఈ చెత్త రికార్డు ఐల్ ఆఫ్ మ్యాన్ - స్పెయిన్ జట్ల మధ్య నమోదైంది.
ఈ రెండు జట్ల మధ్య కార్గెజెనాలోని లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. మరో ముగ్గురు ఆటగాళ్లు తలా రెండు పరుగులు చొప్పున చేశారు. జోసెఫ్ బరోస్ 4 పరుగులు చేశారు. దీంతో 10 పరుగులకే ఆలౌట్ అయింది.
స్పెయిన్ బౌలర్లలో లెఫ్టార్మ్ బౌలర్లు అతిఫ్ మొహమద్, మహ్మద్ కమ్రాన్‌లో చెరో నాలుగు వికెట్లు చొప్పున తీశారు. ఇందులో కమ్రాన్ ఖాతాలో హ్యాట్రిక్ కూడా ఉండటం గమనార్హం. ఆ తర్వాత 11 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్ జట్టు కేవలం 2 బంతుల్లో 11 పరుగులు చేసి విజయభేరీ మోగించింది. ఓపెనర్ అవైస్ అహ్మద్ ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. దీంతో 12 పరుగులు వచ్చాయి. ఫలితంగా పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.