గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (15:49 IST)

అంతర్జాతీయ టీ20కి మిథాలీ రాజ్‌ గుడ్‌బై

భారత క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. అయితే, 2021లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిథాలీ వెల్లడించింది. భారత్‌కు ప్రపంచకప్ సాధించిపెట్టడం తన కల అనీ, తనకు సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొంది. అలాగే త్వరలోనే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడబోతున్న భారత జట్టుకు శుభాకాంక్షలు చెప్పింది.
 
కాగా, మిథాలీ రాజ్ తొలిసారి 2006లో ఇంగ్లండ్‌లోని డెర్బీలో మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. ఆమె మూడు టీ20 ప్రపంచకప్‌లు సహా 32 టీ20ల్లో భారత జట్టుకు నేతృత్వం వహించింది. తన కెరీర్‌లో మొత్తం 89 టీ20 మ్యాచ్ లు ఆడిన మిథాలీ, 2,364 పరుగులు చేసింది. ఇందులో 17 అర్థ సెంచరీలు ఉండగా, ఈమె వ్యక్తిగత అత్యధిక పరుగులు 97. ఆమె చివరిసారిగా ఇంగ్లాండ్ జట్టుపై ఈ ఏడాది మార్చి 9న చిట్టచివరి టీ20 మ్యాచ్ ఆడింది.
 
కాగా, గతంలో మిథాలీ రాజ్‌కు జట్టు సభ్యురాలు హర్మన్ ప్రీత్ కౌర్‌లకు మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెల్సిందే. ఈ విషయం గత యేడాది నవంబరు నెలలో జరిగిన ట్వంటీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ను పక్కనబెట్టారు. ఆ తర్వాత గత ఫిబ్రవరి నెలలో న్యూజిలాండ్ టీ20తో జరిగిన సిరీస్‌కు కూడా మిథాలీని ఎంపిక చేయలేదు. ఈ కారణంగానే మిథాలీ రాజ్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.