ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (17:41 IST)

ట్వంటీ20 ప్రపంచ కప్ : సెమీస్‌లో కివీస్ చిత్తు... ఫైనల్‌లో పాక్‌తో తలపడే జట్టు ఏది?

pakistan team
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్ధేశించిన 153 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ ఆటగాళ్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయలక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 13 యేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి పాక్ ముంగిట 153 పరుగుల రన్స్ టార్గెట్ ఉంచింది. 
 
కివీస్ ఆటగాళ్లలో డారెల్ మిచెల్లీ టీ20 మ్యాచ్‌లలో మూడో అర్థ సెంచరీని నమోదు చేశాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌‌లో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లు లైన్ అండ్ లెగ్త్‌తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో సింగిల్స్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. 
 
ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు మిచెల్, విలియమ్‌సన్ 68 రన్స్ జోడించారు. నిజానికి ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు, ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు. ఫీల్డింగ్‌లోను పాకిస్థాన్ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. కివీస్ బ్యాటర్లు మిచెల్ 53 (నాటౌట్), విలియమ్‌సన్ 46, కాన్వే 21, నీషమ్ 16 (నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 19.1 ఓవర్లలో 153 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ 57, బాబర్ అజమ్ 53 పరుగులు చేసి మంచి పునాది వేయగా, హారిస్ 30 పరుగులు చేసి ఔట్ అయ్యారు. మిగిలిన పనిని మసూద్ (3), అహ్మద్ (0)లు పూర్తి చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రిజ్వాన్ ఎన్నికయ్యారు. 
 
గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌‍లో విజేతగా నిలిచే జట్టుతో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌లో తలపడుతుంది. ఇపుడు ఈ మ్యాచ్‌ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని భారత్ ఫైనల్‌లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.