శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (11:11 IST)

హర్యానా యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్.. (video)

ఓ వైపు భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌ అయిన హసన్ అలీ హర్యానాకు చెందిన షమియా అర్జూతో మంగళవారం నిఖా చేసుకోనున్నాడు. 
 
ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దుబాయ్‌లోని అట్లాంటిస్‌ పామ్‌ హోటల్లో వీరి వివాహం చాలా సింపుల్‌గా, అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుందని హసన్‌ అలీ సన్నిహితుడు పేర్కొన్నాడు.
 
హసన్ అలీ సోమవారం నాడు తన సన్నిహిత మిత్రులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘బ్యాచిలర్‌గా చివరి రాత్రి’ అంటూ ట్వీట్‌ చేసాడు. హసన్‌ ట్వీట్‌పై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పందించారు. హసన్‌కు అభినందనలు, మీరిద్దరూ జీవితాంతం ప్రేమతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు, అలాగే ఈసారి మనం కలిసినప్పుడు మంచి ట్రీట్‌ ఇవ్వాలని సానియా శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇక భారత యువతిని పెళ్లాడుతున్న నాలుగో పాక్‌ క్రికెటర్‌గా హసన్‌ నిలువనున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్, మోహ్సిన్ హసన్ ఖాన్‌, షోయాబ్‌ మాలిక్‌లు కూడా భారత యువతులనే పెళ్లాడిన సంగతి తెలిసిందే.
 
హసన్ అలీ, షమియా అర్జూలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా హసన్ ఈ వార్తలను ఖండిస్తూ వచ్చాడు. చివరకు తామిద్దరం ప్రేమించుకుంటున్నట్లు తెలిపాడు. అయితే నిఖా చేసుకోవడానికి మాత్రం సమయం పడుతుందని తెలియజేసాడు. ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన షమియా.. ప్రస్తుతం ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. 
 
వీరిద్దరి మధ్య దుబాయ్‌లోనే ప్రేమ చిగురించిందని, ఉమ్మడి స్నేహితుడి ద్వారా షమియాతో పరిచయం ఏర్పడిందని హసన్‌ పేర్కొన్నాడు. భారత్-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులకు భిన్నంగా వీరిద్దరి వివాహం హాట్ టాపిక్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.