బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (16:16 IST)

వరల్డ్ కప్‌కు ముందు రోహిత్ శర్మ ఔట్...

త్వరలో క్రికెట్ వరల్డ్ కప్ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియా జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం భారత జట్టులో అత్యంత కీలక మార్పులు చేయాలని బీసీసీఐ క్రికెటర్లు భావిస్తున్నారు. ఇందులోభాగంగా, భారత ఓపెనర్ రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించారు. తప్పించడం అంటే.. జట్టు నుంచి శాశ్వతంగా మాత్రం కాదు.. కేవలం వరల్డ్ కప్‌కు ముందు విశ్రాంతినిచ్చారు. 
 
కాగా, వరల్డ్ క్రికెట్ మెగా టోర్నీ మే 29వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీ కోసం ఏప్రిల్ 23వ తేదీలోపు జట్టును ప్రకటించాల్సివుంది. ఇందుకోసం భారత సెలెక్టర్లు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. అదేసమయంలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం అత్యుత్తమ టీమ్‌ను బరిలోకి దించే అవకాశాలు కనిపించడం లేదు.
 
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు వన్డేలు, మూడు టీ20లకు కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంతో కెప్టెన్సీ చేపట్టిన రోహిత్‌శర్మకు కూడా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కోహ్లీ కూడా పూర్తి ఐదు వన్డేల సిరీస్‌కు ఉంటాడా లేదా అన్నది కూడా అనుమానమే.
 
వీరి స్థానంలో కేఎల్ రాహుల్, అజింక్యా రహానేలను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు దినేష్ కార్తీక్, రిషబ్ పంత్‌లకు మరింత మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. పేస్ బౌలర్లనూ ఇలాగే రొటేట్ చేయాలన్నది కమిటీ ఆలోచనగా కనిపిస్తోంది. బుమ్రా, భువనేశ్వర్, షమిలాంటి ఫ్రంట్‌లైన్ బౌలర్లను రొటేట్ చేయనున్నారు. టీమ్ ఎంపికకు సంబంధించి కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలతో సెలక్టర్లు చర్చలు జరుపుతున్నారు.