జట్టులో సైలెంట్ హీరో అతడే.. అందుకే ఈజీగా గెలిచాం : రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టులో ఒక సైలెంట్ హీరో ఉన్నాడని, అతనే శ్రేయాస్ అయ్యర్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ రాణించడం వల్లే తాము అన్ని మ్యాచ్‌లలో సులభంగా గెలిచామని చెప్పారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసి ఛాంపియన్స్‌గా అవతరించిన విషయం తెల్సిందే.
ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, టోర్నీలో తమ విజయంలో ఒక సైలెట్ హీరో ఉన్నాడని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్‌ను తాను సైలెంట్ హీరోగా అభివర్ణిస్తున్నట్టు చెప్పాడు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ రాణించడంతో సులువుగా విజయాలు నమోదు చేయగలిగామని వివరించారు.
"ఈ టీమ్ పట్ల నేనేంతో గర్విస్తున్నాను. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చని మాకు తెలుసు. అందుకు అనుగుణంగా మమ్మల్ని మేం తీర్చిదిద్దుకున్నాంం. ఈ టోర్నీలో మేం ఆడిన అన్ని మ్యాచ్‌లు చూస్తే పిచ్‌లు మందకొడిగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. టోర్నమెంట్ మొత్తం అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇతరులతో కలిసి అతడు నమోదు చేసిన భాగస్వామ్యాలు ఎంతో విలువైనవి. అందుకే శ్రేయాస్ అయ్యర్ మా సైలెంట్ హీరో" అని రోహిత్ శర్మ పేర్కొన్నారు.
కాగా, ఈ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్ పాకిస్థాన్‌పై 56, న్యూజిలాండ్‌పై 79, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 45, ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 48 చొప్పున పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.