సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (08:42 IST)

శత్రుదేశాల గుండెల్లో దడ పుట్టించే రాఫెల్ జెట్లకు స్వాగతం.. సచిన్

శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టించే రాఫెల్ జెట్ ఫైటర్లకు ఘన స్వాగతమంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాఫెల్ జెట్లకు స్వాగతం పలుకుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
మన సైన్యంలో ఇవి భాగమైనందుకు వైమానిక దళానికి అభినందనలు తెలిపిన సచిన్.. జైహింద్ అంటూ ట్వీట్ చేశాడు. విశ్రాంతి లేకుండా గగనతలం నుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన సైనిక బలగాలకు మరింత సామర్థ్యం వచ్చిందని పేర్కొన్నాడు.
 
అణ్వస్త్రాలతో దాడి చేయగల సామర్థ్యం ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్స్ కోసం 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ మొత్తం 59 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 విమానాలు రావాల్సి ఉండగా, తొలి విడతలో భాగంగా రెండు రోజుల క్రితం ఐదు విమానాలు గత బుధవారం భారత్‌ గడ్డను ముద్దాడిన విషయం తెల్సిందే. 
 
రాఫెల్ దెబ్బకు ప్రకంపనలు 
అలాగే రాఫెల్ యుద్ధ విమానాలు దేశానికి చేరుకోవడంపై భారత క్రికెటర్ మనోజ్ తివారీ చమత్కారంతో కూడిన ఓ ట్వీట్ చేశారు. భారత్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు అడుగుపెట్టిన వెంటనే పొరుగు దేశాల్లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించిందంటూ ట్వీట్ చేశారు. రాఫెల్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటగా తాజాగా మనోజ్ తివారీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
 
రాఫెల్ విమానాలు భారత్‌లో ల్యాండ్ అయిన వెంటనే పొరుగు దేశాలు భారీ కుదుపునకు గురయ్యాయన్నారు. ఈ విమానాల రాకతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరిగిందని, ఇకపై పొరుగు దేశాల నుంచి రెచ్చగొట్టడాలు ఉండవని పేర్కొన్నాడు.
 
అంబాలాలో ఇవి ల్యాండ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా అంబాలా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒప్పందంలో భాగంగా మిగతా విమానాల్లో మరికొన్ని ఆగస్టులో రానున్నట్టు సమాచారం.