గౌతమ్ గంభీర్‌కు మెదడుందా? అఫ్రిది ఫైర్ (వీడియో)
2019 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగాడు.
గంభీర్- అఫ్రిదీల మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. వీళ్లిద్దరూ క్రికెట్ నుంచి విరమణ పొందినప్పటికీ.. నువ్వా నేనా అన్న చందంలో మాటల దాడి చేసుకుంటూ వుంటారు. ఇటీవల అఫ్రిది జీవిత చరిత్ర పుస్తకరూపంలో రావడం వీరిద్దరి మధ్య మళ్లీ చిచ్చు పెట్టింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకున్న గౌతం గంభీర్.. భారత్-పాకిస్థాన్ జట్లు వరల్డ్ కప్‌లో ఆడటంపై బీసీసీఐ కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో కూడా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడాల్సిన పరిస్థితి ఏర్పడినా.. ఆ మ్యాచ్ జరగకూడదని అన్నాడు. ప్రస్తుతం గంభీర్ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి.
గంభీర్ కామెంట్స్‌పై పాకిస్థాన్ మీడియాతో మాట్లాడిన అఫ్రిది.. గౌతమ్ గంభీర్ మాటలు మెదడు వుండే మనిషి మాట్లాడేలా లేవని ఫైర్ అయ్యాడు. చదువుకున్న వాళ్లు, మనస్థిమితం వున్న వారు ఇలా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించాడు.
కాగా, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా, భారత్ తన తొలి మ్యాచ్‌లు సౌతాఫ్రికాతో ఆడనుంది. అలాగే, జూన్ 16వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం మొదలెట్టిన కొన్ని నిమిషాల్లోనే హాట కేకుల్లా అమ్ముడుపోయాయి.