సోమవారం, 4 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (14:35 IST)

టీ20 ప్రపంచ కప్ : అమెరికాలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న భారత్!!

team india
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అమెరికాకు చేరుకున్న భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. అలాగే, ఈ టోర్నీ కోసం సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ సేన మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 
 
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఆధ్వర్యంలో సాధన చేసింది. ఇందులో రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, జస్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ తదితరులు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. అనంతరం ఆటగాళ్లంతా కాసేపు ఫుట్ బాల్ ఆడారు. ఆ తర్వాత వర్కౌట్స్ చేశారు.
 
ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ఆటగాళ్లు తమ అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో మన ఆటగాళ్లంతా జాగింగ్ చేస్తూ కనిపించారు.
 
వ్యక్తిగత కారణాల వల్ల జట్టుతోపాటు అమెరికా వెళ్లని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విడిగా అక్కడకు చేరుకున్నాడు. జట్టులోని సహచరులతో కలసి ప్రాక్టీస్ చేశాడు. 'ఆన్ నేషనల్ డ్యూటీ' అంటూ తన ప్రాక్టీస్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. మరోవైపు 'కింగ్' కోహ్లీ ఇంకా జట్టులోకి చేరాల్సి ఉంది. 
 
కాగా, గ్రూప్ ఏలో ఉన్న రోహిత్ సేన ఐర్లాండ్, కెనడా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తోపాటు అమెరికాతో తలపడనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అలాగే జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ గేమ్ శక్తిసామర్థ్యాలను పరీక్షించుకోనుంది.