22 నుంచి ఇంగ్లండ్‌తో టీ20 పోరు : భారత్‌కు అగ్నిపరీక్ష!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల పోరు బుధవారం నుంచి ప్రారంభంకానుంది. వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు జరిగే ఈ పొట్టి క్రికెట్ భారత్‌కు అగ్నిపరీక్షగా మారనుంది.
అలవోకగా సిక్సర్లు బాదే హిట్టర్లు.. బంతిని బౌండరీలు దాటించే బ్యాటర్లు.. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగే ఆల్‌రౌండర్లు.. ఇలా ఏ రకంగా చూసుకున్నా రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ పొట్టి సిరీస్ అభిమానులకు అసలు సిసలు వినోదాన్ని అందించడం ఖాయం. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఒక రోజు ముందే న్యూజిలాండ్ జట్టు తుది జట్టును ప్రకటించింది.
కెరీర్‌లో మూడు టీ20లు ఆడిన ఫాస్ట్‌బౌలర్ గస్ అట్కిన్సన్ ఏడాది తర్వాత టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. అతను చివరగా 2023 డిసెంబరులో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో ఆడాడు. ఆదిల్ రషీద్‌ను ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు.
పార్ట్ టైమ్ స్పిన్నర్లు లివింగ్‌స్టన్, జాకబ్ బేథల్‌లను కూడా తుది జట్టులోకి ఎంపిక చేశారు. మరో విషయం ఏంటంటే.. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్‌గా నియమించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు 24 టీ20లు జరగ్గా.. ఇంగ్లిష్ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత గడ్డపై 11 మ్యాచ్‌లు ఆడి ఐదుసార్లు గెలిచింది.
భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.