బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (12:36 IST)

అభాసుపాలవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.. ఇమ్రాన్‌కు సెహ్వాగ్ కౌంటర్

జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు విషయంలో అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పదే పదే అవమానాల పాలవుతున్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల సభలోనైతే ఏకంగా అణుయుద్ధం గురించి ప్రస్తావించి అభాసుపాలయ్యారు. 
 
కాగా ఐరాసలో ఇమ్రాన్‌ ప్రసంగంపై ఇప్పటికే క్రికెటర్లు హర్భజన్‌సింగ్‌, మహ్మద్‌ షమి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక మరో మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ తనదైన శైలిలో ఇమ్రాన్‌పై సెటైర్లు వేశాడు. చైనాలో మౌలిక సదుపాయాలను ఇమ్రాన్‌ మెచ్చుకొంటూ.. అమెరికాలో చిన్నకార్లు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయని ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 
 
దీనిపై అమెరికా విలేకరి.. మీరు ఓ ప్రధానిలా కాకుండా వెల్డింగ్‌ చేసే వ్యక్తిలా మాట్లాడుతున్నాడని కౌంటరిచ్చాడు. దీనిపై సెహ్వాగ్‌ స్పందిస్తూ..'అభాసుపాలయ్యేందుకు ఇమ్రాన్‌ కొత్తదారులు వెదుకుతున్నాడు' అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. 
 
సెహ్వాగ్‌ వ్యాఖ్యలకు మరో క్రికెటర్‌ గంగూలీ మద్దతుగా నిలిచాడు. క్రికెట్‌ ప్రపంచానికి తెలిసిన ఇమ్రాన్‌ ఈయన కాదన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్‌ ప్రసంగం పేలవంగా ఉందని, శాంతి కోరుకోవాల్సిన దేశం తీరు ఇలా ఉండకూదని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై మరికొందరు క్రికెటర్లు కూడా ఘాటుగానే స్పందించారు.
 
గత నెల 26న జరిగిన ఐరాస సాధారణ సభ 74వ సమావేశాల వేదికగా భారత అంతర్గత విషయమైన ఆర్టికల్‌ 370 రద్దును ప్రస్తావించిన ఇమ్రాన్‌.. ఓ అంతర్జాతీయ వేదికపై రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా పెరిగిపోతోందన్నారు.

భారత్‌ తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిపోయే అవకాశం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయంటూ హెచ్చరించే యత్నం చేశారు.