గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (19:30 IST)

ధోనీ లేకపోవడం మైనస్సే.. మహీ వుండివుంటే.. కుమ్మేసేవాడు..(video)

టీమిండియా క్రికెటర్లలో మాజీ కెప్టెన్ ధోనీకి మించిన వాడు లేడు. అతనికి అతనే సాటి. ధోనీ జట్టులో లేకపోవడం వల్లే భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా నాలుగో వన్డేలో గెలుపును నమోదు చేసుకుందని క్రీడా పండితులు అంటున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్.. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించినా ఓటమిని చవిచూసింది. 
 
మొహాలీలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత బ్యాటింగ్‌తో 50 ఓవర్లలో 358 పరుగులు సాధించింది. శిఖర్ ధావన్ 143 పరుగులు సాధించాడు. తదనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని 47.5 ఓవర్లలో ఆరు వికెట్ల పతనానికి చేధించింది. తద్వారా ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఇలా నాలుగో వన్డేలో భారత్ ఓడిపోయేందుకు జట్టులో ధోనీ లేకపోవడమే కారణమని టాక్ వస్తోంది. పేలవమైన ఫీల్డింగ్ కారణంగానే భారత్ ఓడిపోయిందని క్రీడా పండితులు అంటున్నారు. వికెట్ కీపింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ తేలిపోయిందని.. ఇంకా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీలకమైన స్టంపింగ్ వికెట్ చేజార్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
రిషబ్ పంత్ స్టంపింగ్ వికెట్‌ను చేజార్చుకోవడానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అదే రిషబ్ పంత్ స్థానంలో ధోనీ వుండి వుంటే జట్టుకు విజయం ఖాయమయ్యేదని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు.
 
కాగా.. నాలుగో వన్డే భారత్ పరాజయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఇచ్చారని, అయితే మూడో స్థానం కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగకుండా.. కేఎల్ రాహుల్‌ను దించడం ప్రస్తుతం సరైంది కాదన్నాడు. భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో వున్నప్పుడు కేఎల్ రాహుల్‌ను బరిలోకి దించి వుండాల్సింది. 
 
శిఖర్ ధావన్, రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారత రన్ రేట్ బాగా పెరిగిందని.. అయితే కేఎల్ రాహుల్ దిగడంతో టీమిండియా రన్ రేటును అది దెబ్బతీసిందని.. అదే సమయంలో విరాట్  కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి వుంటే భారత రన్ రేటుకు ఎలాంటి దెబ్బ వుండేది కాదన్నాడు. అంతేగాకుండా.. కోహ్లీ దిగివుంటే భారత్ గెలుపును నమోదు చేసుకుని వుండేదని ధోనీ అభిప్రాయపడ్డాడు. 
 
ఇక బౌలింగ్ విభాగంలో ఆరుగురు బౌలర్లు ఈ మ్యాచ్‌లో బంతులేసినప్పటికీ.. ఏ ఒక్కరూ ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేదన్నాడు ధోనీ. కానీ విజయశంకర్ మాత్రం ఐదు ఓవర్లకు బంతులేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చాడని కొనియాడాడు. కానీ కేదార్ జాదవ్, చాహెల్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారని చెప్పాడు. కోహ్లీ మరిన్ని ఓవర్లు విజయ శంకర్‌కు ఇచ్చి వుండాల్సిందని ధోనీ అభిప్రాయపడ్డాడు. 
 
ఏది ఏమైనా ధోనీ లేని లోటు ఈ మ్యాచ్‌లో బాగా స్పష్టంగా కనిపించిందని.. మహీ వుండి వుంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బౌలర్లకు, కెప్టెన్ కోహ్లీకి మరిన్ని సలహాలు, సూచనలు ఇచ్చి జట్టును గెలిపించి వుంటాడని క్రీడా పండితులే  కాకుండా నెటిజన్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.