మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2023 (10:17 IST)

వన్డే ప్రపంచ కప్ : నేడు భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. తుది జట్టు ఇదేనా?

indian players
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఐదు వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్‌తో వరుస పరాజయాలతో సతమతమవుతున్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తలపడనుంది. వరుసగా ఆరో మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలవాలని భారత్ గట్టిపట్టుదలతో ఉంది. మరోవైపు, సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం వల్ల లభించే విజయంతో కాస్తైనా ఉపశమనం పొందాలని ఇంగ్లండ్ భావిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో లక్నో వేదికగా బరిలోకి దిగే భారత జట్టులో మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే భారత్ బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కొన్ని సంకేతాలు ఇచ్చాడు. ఇంగ్లండ్‌పై  గత మ్యాచ్‌లో ఆడిన జట్టును కొనసాగించనున్నామని, తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు ఉంటుందని రాహుల్ ధృవీకరించాడు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం జట్టుకు కొంత లోపమేనని అభిప్రాయపడ్డారు. 
 
పాండ్యాకు గాయమవ్వడం దురదృష్టకరమని, ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలిపాడు. బహుశా సూర్యకు ఛాన్స్ దక్కుతుందని, సూర్య ఎలా ఆడగలడో తమకు తెలుసని, కాబట్టి హార్దిక్ తిరిగి జట్టులోకి వచ్చేవరకు సూర్యపై నమ్మకం ఉంచుతామని స్పష్టం చేశాడు. 
 
ఇక టీమిండియా తొలి ఐదు మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసి గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ అవకాశం వస్తే మంచిదని, మొదటి ఇన్నింగ్స్ సవాలును ఏవిధంగా ఎదుర్కోవాలో తెలుసుకుంటామని అన్నాడు. లక్నోలో ప్రీ - మ్యాచ్ మీడియా సమావేశంలో ఈ విధంగా స్పందించాడు.
 
కాగా.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా మొత్తం 10 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఇండియా రెండవ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లనుంది.