ఇలాంటి ఆట తీరును ఇంతకుముందెన్నడూ చూడలేదు : మైఖేల్ వాన్
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా పాల్గొన్న ఇంగ్లండ్ జట్టు చెత్త ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. మైదానంలో ఆ జట్టు ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆటతీరును తాను ఎపుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఈ టోర్నీలో ఇంగ్లండ్ చెత్త ఆట తీరుతో వరుస ఓటముల పరంపర నుంచి తప్పించుకోలేకపోతోంది. తాజాగా నాలుగో ఓటమిని కూడా మూటగట్టుకోవడంతో ఆ జట్టు పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. గురువారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ చివరి నుంచి రెండో స్థానానికి దిగజారింది. ప్రస్తుతం రెండంటే 2 పాయింట్లు మాత్రమే ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా ఒక విజయమే సాధించింది. ఆ జట్టు రన్ రేట్ -1.634గా ఉంది. దీంతో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్‌ను భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌లతో ఆడనుంది. ఆతిథ్య భారత్, ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాలు మంచి ఫామ్‌లో ఉన్నాయి. దీంతో ఈ జట్లపై గెలుపు ఇంగ్లీష్ జట్టుకు అంత సులభంగా ఉండకపోవచ్చు. దీంతో ఆ జట్టు సెమీఫైనల్ అవకాశాలు దాదాపు గల్లంతు అయినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే, ఇంగ్లండ్‌పై గెలుపుతో శ్రీలంక పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో 4 పాయింట్లతో ఉంది. ఇక భారత్ (10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), న్యూజిలాండ్ (8 పాయింట్లు), ఆస్ట్రేలియా (6 పాయింట్లు) వరుస 4 స్థానాల్లో ఉన్నాయి.