సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 నవంబరు 2023 (22:46 IST)

కివీస్ 7 వికెట్లు తీసి వెన్నువిరిచిన మహ్మద్ షమీ: సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

Mohammed Shami
కర్టెసి-ట్విట్టర్
ప్రపంచ కప్ 2023 పోటీల్లో భాగంగా బుధవారం భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ చివరి 10 ఓవర్ల వరకూ ఎంతో ఉత్కంఠ రేకెత్తించింది. ఒక దశలో న్యూజీలాండ్ జట్టు భారత్ నిర్దేశించిన లక్ష్యం 398 పరుగులను అధిగమిస్తుందా అనే ఆందోళనలు సైతం వచ్చాయి. ఐతే భారత్ బౌలర్ల లోని తురుపు ముక్క అయిన మహ్మద్ షమీ భారత జట్టు విజయానికి వెన్నెముకగా నిలిచాడు. కీలక వికెట్లు తీయడమే కాకుండా ఏకంగా 7 వికెట్లు తీసి ప్రపంచ కప్ పోటీల్లో ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలరుగా రికార్డు సృష్టించాడు. షమీ ధాటికి న్యూజిలాండ్ జట్టు వెన్నువిరిగిపోయింది. దీనితో 70 పరుగులు తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. 
 
భారత్ నిర్దేశించిన లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన న్యూజీలాండ్ బ్యాట్సమన్లను తొలి 10 ఓవర్ల లోపుగానే ఔట్ చేసాడు మహ్మద్ షమీ. కాన్వే 13 పరుగులు, రవీంద్ర 13 పరుగులకే ఔటయ్యారు. ఐతే ఆ తర్వాత క్రీజులో కివీస్ కెప్టెన్ విలియమ్సన్, మిచ్చెల్ పాతుకుపోయినట్లు కనిపించారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. 220 పరుగుల వద్ద 3వ వికెట్ పడిందంటే వారు ఎలా ఆడారో తెలుసుకోవచ్చు. 32.2 ఓవర్ల వరకూ భారత్ జట్టు గెలుపుపై సందేహాలు తలెత్తాయి. ఒకవైపు విలియ్సన్ ఇంకోవైపు మిచెల్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. విలియమ్సన్ 8x4, 1x6 సహాయంతో 69 పరుగులు చేసాడు. మిచెల్-విలియమ్సన్ ద్వయాన్ని విడదీసేందుకు రోహిత్ శర్మ వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది.
 
రెండో స్పెల్లో మహ్మద్ షమీని బౌలింగు బరిలోకి దింపడంతో అది వర్కవుట్ అయ్యింది. విలియమ్సన్ ఔట్ కావడంతో న్యూజీలాండ్ స్కోరు కార్డ్ మందగించింది. ఆ తర్వాత వచ్చిన లథమ్ మహ్మద్ షమీ బౌలింగులో డకౌట్ అయ్యాడు. దాంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్-మిచెల్ తో కలిసి మళ్లీ ఎదురుదాడి మొదలుపెట్టాడు. అతడు ప్రమాదకరంగా మారాడు.
 
మహ్మద్ సిరాజ్ వేసిన ఒకే ఓవరులో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. దీనితో రోహిత్ శర్మ ఆలోచనలో పడ్డాడు. తదుపరి ఓవర్లో బూమ్రాను దించడంతో ఫిలిప్స్ 41 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చంపా 2 పరుగులకే ఔటయ్యాడు. మహ్మద్ షమీ కివీస్ కీలక ఆటగాడు మిచెల్ వికెట్ కూలగొట్టడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. మిచెల్ 119 బంతుల్లో 9x4, 7x6తో 134 పరుగులు చేసాడు. ఆ తర్వాత వచ్చిన సత్నర్ 9 పరుగులు, సౌథీ 9, ఫెర్గూసన్ 6 వద్ద ఔటయ్యారు.