బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (08:31 IST)

మరికొన్ని గంటల్లో భారత్ - కివీస్ సమరం... ముంబై వేదికగా తొలి సెమీ ఫైనల్

indis va new zealand
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 మెగా ఈవెంట్‌ చివరి అంకానికి చేరుకుంది. ఇందులోభాగంగా, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరుగనుంది. ముంబైలోని వాంఖేడ్ స్టేడియం ఈ పోరుకు ఆతిథ్యమివ్వనుంది. తొలి పోరులో ఆతిథ్య భారత్ - పర్యాటక న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. లీగ్ మ్యాచ్‌‍లలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. మంచి ఊపుమీదుంది. అలాగే, డిఫెండింగ్ రన్నరప్ న్యూజిలాండ్ జట్టుతో జరిగే పోరు రసవత్తరంగా జరుగనుంది. 
 
ముఖ్యంగా గత 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ తహతహలాడుతుంది. అదేసమయంలో వరుసగా రెండోసారి ఫైనల్ చేరాలని కివీస్ ఆటగాళ్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే స్వదేశంలో అభిమానుల మధ్య సెమీస్ ఆడనుండడంతో టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే అంశంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, ఏది ఏమైనా విజయంపైనే జట్టు పూర్తి దృష్టి పెడుతుందన్నాడు. 
 
కాగా, గత 1983 ప్రపంచ కప్‌ను ప్రస్తావిస్తూ గత రికార్డులు ప్రస్తుత మ్యాచ్‌లో కీలకం కాబోవన్నాడు. '1983 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మేము పుట్టలేదు. 2011 వరల్డ్ కప్ గెలిచిన సమయానికి ప్రస్తుత జట్టులోని సగం మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. అదే మా టీమ్ ప్రత్యేకత. గత ప్రపంచకప్‌‍లను గెలిచిన విధానాలపై మా ఆటగాళ్లు చర్చించుకోవడం నేను చూడలేదు. తదుపరి మ్యాచ్‌కు ఎలా మెరుగవ్వాలి. అత్యుత్తమంగా ఎలా రాణించాలనే దానిపైనే మా దృష్టి ఉంది. మా జట్టులోని ఆటగాళ్ల గొప్పదనం ఇదే. మొదటి మ్యాచ్ నుంచి సెమీస్ వరకు గెలుపుపైనే దృష్టిపెట్టాం' అని రోహిత్ పేర్కొన్నాడు. 
 
మరోవైపు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో టీమిండియా కాంబినేషన్ మారిపోయిందన్నాడు. మొదటి మ్యాచ్ నుంచి ఇతర ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాలని భావించామని, జట్టులో బౌలింగ్ ఆప్షన్లు ఉండడం మంచిదని రోహిత్ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకునే పరిస్థితి రాకూడదన్నాడు. ఇదిలావుండగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.