గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

వరల్డ్ కప్ : భారత్ - న్యూజిలాండ్ సెమీస్ పోరు .. ఏపీలో భారీ స్క్రీన్లపై ప్రదర్శన

team india
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో నాకౌట్ పోటీలైన సెమీస్ పోరు జరుగుతుంది. తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ను ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లపై లైవ్ టెలికాస్ట్ చేసేలా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేశారు. విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లపై ఈ లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఇక్కడ ఒకేసారి ఏకంగా పది వేల మంది కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెల్సిందే.