మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (15:25 IST)

పొలార్డ్ అదుర్స్ : బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల తేడాతో విండీస్ విన్!

కీరన్ పొలార్డ్ విజృంభణ, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దనీష్ రాందీన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ వెస్టిండీస్‌కు బంగ్లాదేశ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాయి. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. 
 
బంగ్లాదేశ్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు 39.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. 70 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 89 పరుగులు సాధించిన పొలార్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 217 పరుగులు చేసింది. అనాముక్ హక్ (109) సెంచరీ సాధించినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. 
 
వెస్టిండీస్ బౌలర్లలో డ్వెయిన్ బ్రేవో ఏడు ఓవర్లలో 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆరంభంలో తడబడినా.. రాందీన్, పొలార్డ్ జోడీ ఆరో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, జట్టు విజయానికి పునాది వేశారు. 
 
76 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసిన రాందీన్ జట్టు స్కోరు 179 పరుగుల వద్ద అవుట్‌కాగా, పొలార్డ్ వికెట్ 201 స్కోరువద్ద కూలింది. జాసన్ హోల్డన్ (నాటౌట్ 22), సునీల్ నారైన్ (నాటౌట్ 3) మరో వికెట్ కూలకుండా జట్టుకు విజయం సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.