బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By మోహన్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (15:30 IST)

వరల్డ్ కప్ : ఇంగ్లండ్ ఫీల్డింగ్.. అయితే ఈ మ్యాచ్ భారత్-పాక్ కన్నా....

ప్రపంచకప్ 2019లో భాగంగా మంగళవారం జరుగుతున్న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. ఇంగ్లండ్ జట్టు గత మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 
 
కాగా ఆస్ట్రేలియా జట్టులో మాత్రం ఆడమ్ జంపా, కౌల్టర్ నైల్ స్థానంలో నాథన్ లియాన్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్ ఆడుతున్నారు. సాధారణంగా ప్రపంచ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందంటే అభిమానులు ఎన్ని పనులు ఉన్నా పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతారు. భారత్-పాక్ మ్యాచ్ లాగే మరో రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లను అభిమానులు ఎంతో ఆసక్తితో చూస్తారు. 
 
అదే ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ రెండు దేశాలు ఎప్పుడు పోటీపడినా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఒక విధమైన భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు అంత ఆదరణ లభిస్తుంది. వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రెండు దేశాల మధ్య మంగళవారం జరిగే మ్యాచ్ పట్ల క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.