మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (12:53 IST)

వెస్టిండీస్ గుండెపగిలె ... బంతులున్నాయ్.... కానీ ఓడిపోయింది.. ఎలా?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్‌లలో మరో ఆసక్తికర మ్యాచ్ శనివారం జరిగింది. ఒకవైపు భారత్ - ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠత మధ్య సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ చచ్చీచెడీ గెలుపొందింది. 
 
మరోవైపు, వెస్టిండీస్ - న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఒక దశలో గెలుపు అంచున్న ఉన్న కరేబియన్లు... 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సివుండగా ఓటమి పాలయ్యారు. ఫలితంగా కోట్లాది మంది కరేబియన్ల గుండె పగిలింది. దీంతో వెస్టిండీస్ జట్టు ఓటమిని మూటగట్టుకుంటే... కివీస్ జట్టు అనూహ్యంగా మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. 
 
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, మాంచెష్టర్ వేదికగా శనివారం మరో లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కివీస్ జట్టులో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (148, 154 బంతుల్లో 14×4, 1×6) వరుసగా రెండో సెంచరీ సాధించడంతో కివీస్‌ 291 పరుగులు (8 వికెట్లకు) చేసింది. 
 
ఆ తర్వాత 292 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్... ఒక దశలో చేసిన స్కోరిది. ఇంకో మూడు వికెట్లు పడటం, వెస్టిండీస్‌ కథ ముగియడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ 82 బంతుల్లో ఐదు సిక్సర్లు, 9 ఫోర్లతో 101 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అలాగే, క్రిస్ గేల్  (87, 84 బంతుల్లో 8×4, 6×6), హెట్‌మెయర్‌ (54, 45 బంతుల్లో 8×4, 1×6)లు రాణించారు. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి వుండగా, బ్రాట్‌వైత్ ఔట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ కథ ముగిసింది. అంటే 49 ఓవర్లలో286 పరుగులకు కరేబియన్లు ఆలౌట్ అయ్యారు.
 
అయితే, ఈ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ మాత్రం మొండిగా పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌ ఓడితే ప్రపంచకప్‌లో విండీస్‌ సెమీస్‌ అవకాశాలకు దాదాపుగా తెరపడుతుందని తెలిసి అతను మొండిగా పోరాడాడు. ఏ స్థితిలోనూ ఆశలు కోల్పోకుండా కివీస్‌ బౌలర్లను అద్భుత రీతిలో ఎదుర్కొన్నాడు. దాదాపుగా విండీస్‌ను గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. కానీ విజయానికి 7 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి ఉండగా.. అతను సిక్సర్‌ కోసం ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌లో బౌల్ట్‌ పట్టిన క్యాచ్‌తో బ్రాత్‌వైట్‌తో పాటు విండీస్‌ కథ ముగిసింది. ఆ జట్టు ఆలౌటైంది. 5 పరుగుల తేడాతో కివీస్‌ గెలిచింది.
 
ఈ ప్రపంచ కప్‌లో 6 మ్యాచ్‌లాడిన కివీస్‌కిది ఐదో గెలుపు. భారత్‌తో మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయింది. ఆ జట్టు దాదాపుగా సెమీస్‌ చేరినట్లే. 6 మ్యాచ్‌లాడిన విండీస్‌కిది నాలుగు ఓటమి. ఒకటే నెగ్గింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఈ ఓటమితో కరీబియన్‌ జట్టు సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి.