శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 10 జూన్ 2019 (12:21 IST)

క్రికెట్ స్టేడియంలో విజయ్ మాల్యా.. ''దొంగ దొంగ'' అని అరిచిన జనం..

ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు లిక్కర్ కింగ్ మాల్యా వచ్చాడు. ఈ మ్యాచ్‌‌ను తిలకించేందుకు విజయ్ మాల్యా రావడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కర్ణాటకకు చెందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ సంస్థను స్థాపించారు. విమాన సర్వీసులను కూడా నడిపారు. 
 
అయితే భారత బ్యాంకుల్లో 9వేల కోట్ల రూపాయల మొత్తాన్ని అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని కేసు నమోదైంది. బ్యాంకులకు అనుకున్న మొత్తాన్ని చెల్లించకుండా.. లండన్‌కు పారిపోయిన మాల్యాను అరెస్ట్ చేసేందుకు భారత ప్రభుత్వం ఇంగ్లండ్ వద్ద అభ్యర్థిస్తూ వినతి పత్రాన్ని సమర్పించింది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ మ్యాచ్‌ను వీక్షించేందుకు మాల్యా వచ్చాడు. ఆపై కొన్ని ఫోటోలకు మాల్యా ఫోజిచ్చాడు. ఆ సమయంలో మాల్యాకు తీరని అవమానం జరిగింది. అక్కడున్న ప్రజల్లో కొందరు హిందీలో ''దొంగ దొంగ'' అంటూ అరిచారు. దీంతో స్టేడియంలో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో విజయ్ మాల్యా అక్కడ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.