మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (14:48 IST)

నాకీ గర్భం వద్దంటూ అత్యాచారానికి గురైన మైనర్ బాలిక: హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచారానికి గురైన మైనర్ బాలిక గర్భం దాల్చిన విషయంపై, బాధితురాలు దాఖలు చేసుకున్న పిటీషన్ పైన కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 25 వారాల గర్భస్రావం జరిగేలా చూడాలని జిల్లా సివిల్ ఆసుపత్రికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 24 వారాల కంటే ఎక్కువ గర్భాన్ని తొలగించడాన్ని చట్టం అనుమతించనందున, గర్భాన్ని తొలగించడానికి వైద్య నిపుణులు, జిల్లా ఆసుపత్రి నిరాకరించడంతో అత్యాచార బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.

 
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ద్వారా 24 వారాల సీలింగ్ నిర్ణయించబడింది. అత్యాచారం తాలూకు భారాన్ని మోయడానికి, తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భం దాల్చిన బిడ్డను ప్రసవించమని బలవంతం చేయడంపై బాలిక తన పిటిషన్‌లో పేర్కొంది.

 
ధార్వాడ్ హైకోర్టు ధర్మాసనం జస్టిస్ ఎన్.ఎస్. సంజయ్ గౌడ మెడికల్ బోర్డు నుంచి దీనిపై అభిప్రాయాన్ని కోరారు. పిటిషనర్ అమ్మాయికి 16 ఏళ్ల వయస్సు ఉన్నందున ఇది బాలిక- బిడ్డ ఇద్దరికీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసు అని బోర్డు పేర్కొంది. ప్రెగ్నెన్సీని అనుమతిస్తే అది బాలిక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని బోర్డు అభిప్రాయపడింది. 

 
అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం గురువారం జిల్లా ఆసుపత్రిలో వెంటనే అబార్షన్ చేయాలని
ఆదేశించింది. బాలిక తన శారీరక సమగ్రతను కాపాడుకునే పవిత్రమైన హక్కును కలిగి ఉందని బెంచ్ నొక్కి చెప్పింది. ఒక మహిళ తన శరీరంలోకి అవాంఛిత చొరబాట్లను భరించమని బలవంతం చేసే చర్య రాజ్యాంగం హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది.

 
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్త్రీ తన పునరుత్పత్తి ఎంపికను ఉపయోగించుకునే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ కోణమని బెంచ్ నొక్కి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గర్భాన్ని కొనసాగించడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా, గౌరవప్రదమైన జీవితానికి హానికరం అని బెంచ్ గమనించింది. కాగా ఫిబ్రవరి 8, 2021న మైనర్ బాలికపై తండ్రీకొడుకులిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. బెలగావి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.