తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి
వావివరసలు మరిచి కన్నతల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొడుకుని హత్య చేయించింది ఓ తల్లి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ప్రకాశం జిల్లా వాస్తవ్యురాలైన సాలమ్మకు నలుగురు పిల్లలు. వీరిలో మూడో కుమారుడు శ్యాంబాబుకి 35 ఏళ్లు. ఐతే ఏ పనీ చేయకుండా మద్యం సేవిస్తూ, దొంగతనాలు చేస్తూ తల్లికి తలవంపులు తెచ్చేవాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాన్నది కూడా తెలియకుండా తప్పతాగి బంధువుల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి మందలించడంతో ఆమె పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
కుమారుడి దుష్ప్రవర్తనతో పూర్తిగా విసిగిపోయిన ఆ తల్లి ఇక అతడిని లేకుండా చేయాలని నిశ్చయించుకున్నది. ఓ ఆటో డ్రైవరుకి సుపారీ ఇచ్చి తన కొడుకును హత్య చేయించింది. ఆటో డ్రైవర్ శ్యాంబాబును తన ఆటోలో ఎక్కించుకుని పూటుగా మద్యం పోయించి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అతడిని హత్య చేసి అనంతరం శరీరాన్ని ముక్కలు చేసి పంట కాలువలో పడేసాడు. పొలం గట్టుపై రక్తపు మరకలు చూసిన స్థానికులు విషయాన్ని పోలీసులు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన కుమారుడిని హత్య చేయించింది తనేనని తల్లి అంగీకరించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.