కళ్లకు గంతలు కట్టి పెళ్లాడబోయే వాడి పీక కోసింది, ఏమైంది?
మరో నెలరోజుల్లోనే పెళ్లి. ధూంధాంగా వస్తువులు, నగలు కొంటున్నారు. కాబోయే జంట తమకు ఇష్టమైన దుస్తులు కొనేందుకు వచ్చారు. షాపింగ్ ముగిసింది. ఇంటికి తిరుగుముఖం పట్టారు. మధ్యలో తను కట్టుకోబోయే భర్త పీక కోసి పరారైంది ఓ యువతి. ఏం జరిగింది?
ఏపీలోని అనకాపల్లి బుచ్చయ్యపల్లి పరిధిలోని కొమళ్లపూడిలో ఓ దారుణం చోటుచేసుకుంది. మాడుగుల మండలానికి చెందిన రామునాయుడికి, రావికమతం గ్రామానికి చెందిన పుష్పకి పెద్దలు వివాహ నిశ్చయం చేసారు. పెళ్లి వచ్చే నెల 20వ తేదీ జరగాల్సి వుంది. ఈ క్రమంలో కాబోయే భార్యాభర్తలు షాపింగ్ చేసేందుకు వడ్డాది వెళ్లారు. ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
దారిమధ్యలో సాయిబాబా గుడి వుండటంతో అక్కడ కొద్దిసేపు విరామం తీసుకుని వెళ్దామని యువతి చెప్పింది. దానితో రామునాయుడు ఆ గుడివద్దకు ఆమెతో కలిసి వెళ్లాడు. ఇంతలో సరదాగా ఓ ఆట ఆడదామంటూ అతడి కళ్లకు గంతలు కట్టింది. అలా ఆడుతూనే తనతో తెచ్చుకున్న కత్తితో కాబోయే వాడి పీక కోసింది.
ఆ తర్వాత తనే బాధితుడ్ని తన ద్విచక్రవాహనంపై తీసుకుని వచ్చి సమీప ఆసుపత్రిలో చేర్పించి గొంతుకు ఏదో గుచ్చుకున్నదని చెప్పి అక్కడి నుంచి పరారైంది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చోసి దర్యాప్తు చేస్తున్నారు.