శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (16:02 IST)

బొబ్బిలిలో అనుమానాస్పదంగా చనిపోతున్న వలంటీర్లు...

deadbody
విజయనగరం జిల్లా బొబ్బలి పట్టణంలో వలంటీర్లు అనుమానాస్పదంగా చనిపోయారు. ఒకే నెలలో ఇద్దరు వలంటీర్లు మృతి చెందారు. అయితే, మృతి చెందిన ఇద్దరు వలంటీర్లు ఏ కారణంతో మృతి చెందారు అనే అంశం మిస్టరీగా మారింది. ఈ నెల 1వ తేదీన ఓ వలంటీర్ మృత దేహం రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో లభించింది. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మరో వలంటీర్ నేడు బావిలో శవమై కపించాడు.
 
బొబ్బిలి పట్టణం 15వ వార్డు వలంటీర్‌గా పనిచేస్తున్న ఆలబోను వెంకట సాయి రామకృష్ణ (24) సోమవారం అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. మూడు రోజులు క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాలేదు. అతని ఫోను సైతం పనిచేయలేదు. ఆందోళన చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులకు వెతకడం ప్రారంభించారు. సోమవారం రాణిగారి తోట సమీపంలోని నేలబావిలో రామకృష్ణ మృతదేహం లభించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకట సాయి రామకృష్ణ గత నాలుగు సంవత్సరాలుగా 15వ వార్డులో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణది హత్యా లేదా ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హత్యా, లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. 
 
ఈ నెల 1వ తేదీన సైతం బొబ్బిలి పట్టణంలోని 10 వార్డు వలంటీర్‌గా పనిచేస్తున్న కిలారి నాగరాజు సైతం అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. నగర సమీపంలోని రైలు పట్టాలపై నాగరాజు మృతదేహం లభించింది. నాగరాజు సోదరుడు రవి సైతం గతంలో 10 వార్డు వలంటీర్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే, రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, రవి సోదరుడైన నాగరాజును అధికారులు 10 వార్డు వలంటీర్‌గా నియమించారు. నాగరాజు కేసును సైతం పోలీసులు అనుమానిత మృతిగా, కేసు నమోదు చేశారు. 
 
ఒకే నెలలో ఇద్దరు వలంటీర్లు మృతి చెందడం అనుమానాలకు తావిస్తుంది. ఇలా 10వ వార్డు, 15 వార్డుకు చెందిన ముగ్గురు వాలంటీర్లు మృతి చెందడంతో బొబ్బిలి పట్టణంలో పని చేస్తున్న వలంటీర్లలో ఆందోళన నెలకొంది. బొబ్బిలి నగరంలో వాలంటీర్లుగా పనిచేయాలంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఇవి హత్యలా లేదా ఆత్మహత్యలా అని తేల్చాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.