సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (14:10 IST)

వివాహేతర సంబంధం: తెల్లారేసరికి రక్తంతో తడిచిపోయిన బెడ్, స్నేహితురాలి డ్రెస్

crime
తన భార్యకు వేరెవరితోనో వివాహేతర సంబంధం వుందన్న అనుమానంతో ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ భర్త. బుధవారం నాడు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఐశ్వర్య నిద్ర లేచి చూసేసరికి ఆమె బట్టలు రక్తంతో తడిసిపోయి కనిపించాయి. భయంతో ఆమె వెనుదిరిగి చూసేసరికి తన స్నేహితురాలు నవ్యశ్రీ విగతజీవిగా మారి కనిపించింది. ఆమెను ఎవరో గొంతు కోసేసారు, తీవ్ర రక్తస్రావమై ఆ రక్తంతో పరుపు, తను వేసుకున్న దుస్తులు తడిసిపోయాయి.
 
ఈ దారుణం పశ్చిమ బెంగళూరులోని కెంగేరి సమీపంలోని విశ్వేశ్వరయ్య లేఅవుట్‌లో జరిగింది. ఐశ్వర్య ఫిర్యాదు మేరకు హత్యకు పాల్పడిన 28 ఏళ్ల మహిళ భర్త కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు చూస్తే.. డ్యాన్స్‌ శిక్షకురాలు నవ్యశ్రీ, కిరణ్‌లు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తన భార్య నవ్యశ్రీ వేరెవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
 
తరచూ గొడవలు జరుగుతుండటంతో తను మాత్రం ఒక్కతే ఇంట్లో ఒంటరిగా వుండటం సురక్షితం కాదని నవ్యశ్రీ, మంగళవారం ఉదయం తన స్నేహితురాలు ఐశ్వర్యను తన ఇంటికి పిలిపించింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన ఐశ్వర్య, నవ్యశ్రీ చిన్ననాటి స్నేహితులు. మంగళవారం సాయంత్రం నవ్యశ్రీ తన నివాసంలో ఐశ్వర్యను కలిసి, వారి కామన్ ఫ్రెండ్స్‌లో ఒకరైన అనిల్‌కు ఫోన్ చేసింది. అనంతరం నవ్యశ్రీని తన కారులో ఎక్కించుకుని ఐశ్వర్య బయటకు వెళ్లింది. ఆ తర్వాత అనిల్‌ను కలిసి నవ్యశ్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
 
సమస్యలపై చర్చించిన తర్వాత తను ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసులకు ఫిర్యాదు చేయాలని నవ్యశ్రీకి అనిల్ సూచించాడు. దీంతో స్నేహితురాళ్లిద్దరూ అనిల్ వద్ద నుంచి అర్థ రాత్రి ఇంటికి తిరిగి వచ్చి బెడ్‌పై పడుకుని నిద్రకు ఉపక్రమించారు. తెల్లారేసరికి తన పక్కనే పడుకున్న స్నేహితురాలు నవ్యశ్రీ మృతి చెంది ఉండడంతో ఐశ్వర్య బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. హత్య జరిగినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా నవ్యశ్రీని గుట్టుచప్పుడు కాకుండా ఆమె భర్తే మట్టుబెట్టాడని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. అతడి వద్ద వున్న మారు తాళంచెవిని ఉపయోగించి గదిలోకి ప్రవేశించాడనీ, అనంతరం గాఢ నిద్రలో వున్న నవ్యశ్రీ గొంతు కోసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.