గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 జనవరి 2022 (13:07 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పక్షవాతం వచ్చింది, వదిలేసి వెళ్లిపోయింది

ప్రేమ చాలా తీయగా వుంటుంది. మధురంగా వుంటుంది. ప్రేయసి కోసం ఏమైనా చేస్తా.. ప్రియుడి కోసం ప్రాణం ఇస్తా... ఇవన్నీ ప్రేమికులు వల్లించే మాటలు. కానీ పెళ్లయిన తర్వాత మాత్రం అదే ప్రేమికులు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే ప్రేమ గుడ్డిది అని కొందరు అంటుంటారు.


ఆ సంగతి అలా వుంచితే... తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని పెళ్లాడితే తనకు రోగం వచ్చిందని వదిలేసి వెళ్లిపోయిందని వాపోతున్నాడు ఓ భర్త. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గుంటూరులోని నెహ్రూ నగర్ కు చెందిన ఓ బాధితుడు సోమవారం నాడు అర్బన్ స్పందనలో ఓ ఫిర్యాదు చేసాడు. తను 2001లో ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు తనకు ఓ యువతి పరిచయమైందనీ, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపాడు.

 
ఆ తర్వాత తమకు ఓ పాప పుట్టిందనీ, 12 ఏళ్లకు తను పక్షవాతం బారిన పడినట్లు వెల్లడించాడు. దాంతో తన భార్య తనను వదిలేసి 2016లో వేరే వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిందనీ, తన కుమార్తెతో సహా తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

 
తనను పట్టించుకునేవారే లేకుండా పోయారనీ, ఆత్మహత్య చేసుకోవడం ఒకటే తనముందు మార్గంగా కనబడుతోందంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తన భార్యతో విడాకులు ఇప్పించి తన కుమార్తెను తనకు దక్కేలా చూడాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై అధికారులు విచారణకు ఆదేశించారు.