గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (08:49 IST)

అఘాయిత్యం చేసిన జైలుకెళ్లిన నిందితుడు.. షాకిచ్చిన కర్నాటక హైకోర్టు!!

victim woman
ఓ యువతిపై అఘాయిత్యం చేసిన జైలుకెళ్లిన ఓ యువకుడికి కర్నాటక హైకోర్టు తేరుకోలని షాకిచ్చింది. ఆ నిందితుడికి 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసి... అత్యాచారం చేసిన యువతిని పెళ్ళి చేసుకుని జైలుకు వెళ్లాలని ఆదేశించింది. 23 ఏళ్ల నిందిత యువకుడు దాదాపు ఏడాదిన్నర క్రితం 16 సంవత్సరాల 9 నెలల వయసున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె గర్భందాల్చి, ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
 
డీఎన్ఏ పరీక్షల్లో నిందితుడే చిన్నారి తండ్రి అని నిర్ధారణ అయింది. కాగా అత్యాచార అభియోగాలపై నిందితుడు జైలులో ఉన్న సమయంలో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. బాధితురాలికి, నిందితుడికి పెళ్లి నిశ్చయించారు. దీంతో తనపై కేసులు కొట్టివేసి ఉపశమనం కల్పించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో నిందితుడు పిటిషన్ దాఖలు చేశాడు.
 
బిడ్డ రక్షణ, బాధితురాలి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం మంచిదని భావించింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ పిటిషనర్ అయిన నిందితుడికి 15 రోజుల బెయిల్ ఇచ్చింది. జులై 3వ తేదీన సాయంత్రం కస్టడీకి రావాలని, జులై 4వ తేదీ జరుగనున్న తదుపరి విచారణకు వివాహ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని రావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎం నాగప్రసన్న శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
 
కాగా తన కూతురిపై నిందితుడు పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 2023లో నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 376(2)(ఎన్)తో పాటు పోక్సో చట్టం-2012లోని 5(ఎల్), 5(జే)(ii), సెక్షన్-6 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.