గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (16:42 IST)

ప్రేమికుడితో ప్రేయసి, యువతిని భయపెట్టి సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు

ప్రేమ మాయలో పడిన యువతీయువకులు లోకాన్నే మరిచిపోతారు. ప్రేమ అనేది అర్ధం చెప్పలేని ఓ అనుభూతి. ప్రేమకు యవ్వనం, వృద్ధాప్యం అనేది తేడా లేకుండా ఎవరి మధ్యనైనా కలిగే ఒక తియ్యని జ్ఞాపకం. ఒకరు ప్రేమించబడడం అనేది ఈ సృష్టిలో అద్భుతమైన వరం లాంటిది.


కానీ నేటి కాలం యువతరానికి ప్రేమ‌ కేవలం ఆకర్షణలా మారుతున్న సందర్భాలు ఎక్కువ. ప్రేమ పేరుతో యువతులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు, యువతులను హతమార్చిన ఘటనలు కోకొల్లలు. పెద్దలు ఎన్ని చెప్పిన ప్రేమా అనే మత్తులో పడి నేటి యువతరం జీవితాలను కష్టాలమయం చేసుకుంటున్నాయి.

 
తాము ప్రేమించిన వారితో కలిసి ఇష్టానుసారం బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ కన్నవారి పరువును దిగజార్చుతున్నారు కొందరు. అయితే సమయం దొరికిందని ఏకాంత సమయం కోసం బయటకు వెళ్ళిన ప్రేమికులకు కలలో కూడా ఊహించని ఘటన ఎదురైంది. లవర్‌తో కలిసి షికారుకి వెళ్ళిన యువతికి ఆకతాయిలు ఎదురు పడడంతో వారి వలలో పడిన యువతి అల్లాడిపోయిన ఘటన ఆలస్యం వెలుగు చూసింది.

 
చిత్తూరు జిల్లా, పీలేరుకు చెందిన యువతీయువకుడు ప్రేమలో పడ్డారు. ఒకే ఊరు కావడం అందులోనూ ఒకే కళాశాలలో డిగ్రీ చదువుతున్న వారిద్దరూ గత కొంత కాలంగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వారి ప్రేమను పెద్ద వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. ఇద్దరు ఒకే తరగతి కావడంతో వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఎక్కువగానే దొరికేది.

 
సెలవు దొరికినప్పుడల్లా సినిమాలకు, షికార్లకు తిరుగుతూ సరదాగా గడిపేవారు. తమ బంగారు భవిష్యత్తు కోసం ఆ ఇద్దరూ ఎన్నో‌ ప్రణాళికలను వేసుకునే వారు. ఇలా ఎంతో సంతోషంగా గడిచి పోతున్న వారి జీవితాల్లో దారుణం జరుగుతుందన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. గత పది రోజుల క్రితం ఆ ప్రేమికులు పీలేరు సమీపంలోని శివారు ప్రాంతానికి వెళ్లారు. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో చూసి కబుర్లు చెప్పుకుంటూ ఒకరి ఇష్టాయిష్టాలను పంచుకుంటూ హాయిగా ఉన్నారు.

 
ఇంతలో అటుగా వెళ్తున్న ముగ్గురు ఆకతాయిలు చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని వీరిద్దరూ నవ్వుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించారు. వెంటనే ఆ ఆకతాయిలను చూసిన ఆ ఇద్దరు ఒక్కసారిగా భయపడి పైకి లేచి ఎవరు మీరు అని ప్రశ్నించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ ఆకతాయిలు ఎవరైతే మీకు ఎందుకని ఆ ప్రేమికులను బెదిరించసాగారు. ఇద్దరు నవ్వుకుంటూ ఉన్న వీడియోను తాము చిత్రీకరించామని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామని ఆ ప్రేమికులను భయాందోళనకు గురిచేశారు ఆకతాయిలు.

 
ఇంతలో మరో ఆకతాయి తమకు మద్యం బాటిల్‌లు తెచ్చి ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాంమని చెప్పడంతో ఆ మాటలను నమ్మిన యువకుడు ఆకతాయిలకు మద్యం బాటిళ్లు తెచ్చేందుకు వైన్ షాప్‌కు పరుగులు తీశాడు. భయంతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ యువతిపై ఆ ముగ్గరు ఆకతాయిలు కన్నేసారు.

 
ఆ యువతితో తమ కామవాంఛ తీర్చుకోవాలనుకున్నారు. ఆ కామాంధులు అనుకున్న విధంగానే యువకుడు మద్యం బాటిళ్లు తీసుకువచ్చే లోపే ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వారు చేసిన పనికి ప్రియుడితో బాధను చెప్పుకుని ఆ యువతి కన్నీరుమున్నీరు అయ్యింది. అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన యువతి తనలోనే బాధను దిగమింగుకుంటూ తీవ్రంగా వేదనకు గురైంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని జీర్ణించుకోలేని యువతి ఇంటిలోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 
అయితే యువతి ఆత్మహత్య యత్నానికి కారణాలు కోరిన పోలీసులు షాక్ గురయ్యే నిజాలు వెల్లడించింది యువతి. దీనిపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను ఆ యువతి తల్లిదండ్రులు అడ్డుకుని తమకు ఎటువంటి న్యాయం అవసరం లేదని, తమను పరువుతో వదిలేయమని చెప్పడంతో చేసేది లేక విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును రహస్యంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పీలేరు శివారు ప్రాంతాంలో‌ ఉన్న పలువురుని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.