నన్ను పెళ్లాడతావా, చంపేయమంటావా?: వివాహితకు యూట్యూబర్ వేధింపు
పెళ్లయినా ఫర్వాలేదు, నువ్వు కావాలి నాకు, నన్ను పెళ్లి చేసుకో, లేదంటే చచ్చిపోతానంటూ చేయి కోసుకుని బెదిరిస్తూ ఓ వివాహితను వేధించాడు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు. అతడి వేధింపులు తాళలేక వివాహిత పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే... నగరంలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన 47 ఏళ్ల అరుణ్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇతడి యూట్యూబ్ ఛానల్లో ఓ వివాహిత భాగస్వామిగా వుంటూ పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసాడు అరుణ్. తనను పెళ్లాడాలంటూ వత్తిడి తెచ్చాడు.
ఆమె అందుకు అంగీకరించడంలేదని చేయి కోసుకుని చచ్చిపోతానంటూ బెదిరించడం ప్రారంభించాడు. అతడి ఆగడాలను భరించలేని వివాహిత పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. బెయిల్ పైన తిరిగి వచ్చిన అరుణ్.. మళ్లీ ఆమెపై వేధింపులకు దిగాడు. తనను పెళ్లాడాలనీ, పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనితో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది.